గణేష్ మండపం పక్కన చికెన్ బిర్యానీ వడ్డించిన వైసీపీ నేతలు.. భక్తుల ఫిర్యాదుతో కేసు బుక్

అభిమానం వేరు.. భక్తి వేరు అనే విషయాన్ని కూడా విస్మరించారు రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నాయకులు. ఓవైపు దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ చేయకూడని పని చేసి కొత్త వివాదానికి తెరతీశారు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైసీపీ నాయకులు. సమాజంలో నలుగురికి మంచి చెప్పాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తులే తప్పుడు సంకేతం ఇచ్చేలా గణేష్ మండపాల దగ్గర చికెన్ బిర్యానీ వడ్డించి పెట్టడం అనేక విమర్శలకు కారణమైంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ అపచారానికి పాల్పడ్డారు వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మొండితోక అరుణ్ కుమార్. ఈఘటన సెప్టెంబర్ 2న దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈసాహసానికి తెగించడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు వైసీపీ నేతలు.
గణేష్ మండపం పక్కన చికెన్ బిర్యానీ పంపిణి..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని జరుపుకుంటున్న సందర్భంగా గణేష్ మండపం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నాయకులు చికెన్ బిర్యానీ భోజనం వడ్డించారని ఆరోపించడంతో మంగళవారం నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మరో 20 మంది స్థానిక గాంధీ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని పోలీసులు తెలిపారు. ఆగస్టు 27 నుండి ఇక్కడ గణేష్ విగ్రహం ప్రతిష్టించబడింది. ఓవైపు చవితి ఉత్సవాలు జరుగుతున్న చోట ఇలాంటి అపచారానికి పాల్పడటంతో ఇది పెద్ద సంఖ్యలో భక్తులను ఆగ్రహానికి గురి చేసింది.

