వైసీపీ నేత భూమనకు షాక్..! తిరుపతి పోలీసుల సమన్లు..!

వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి పోలీసులు షాకిచ్చారు. టీటీడీ టార్గెట్ గా ఆయన చేస్తున్న వరుస విమర్శల నేపథ్యంలో ఆయనకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఆయన చేసిన ఓ సంచలన ఆరోపణకు సంబంధించి ఆధారాలతో విచారణకు రావాలని కోరుతూ ఇవాళ సమన్లు ఇచ్చారు. దీంతో ఆయన ఎల్లుండి విచారణకు హాజరు కావాల్సి ఉంది.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలో భారీ సంఖ్యలో ఆవులు చనిపోతున్నాయని గతంలో భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీ నిర్లక్ష్యం వల్లే ఇలా 100కు పైగా గోవులు చనిపోయాయని ఆయన ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కూటమి ప్రభుత్వంలో ఇలా భారీ సంఖ్యలో గోవులు చనిపోవడం ఏంటన్న చర్చ మొదలైంది. దీనిపై ప్రభుత్వంతో పాటు టీటీడీ కూడా తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో చర్చకు ఆధారాలతో వచ్చేందుకు రెడీ అని భూమన ప్రకటించారు. కానీ పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
అయితే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డిని గోవుల మృతిపై ఆధారాలు కోరుతూ సమన్లు ఇచ్చారు. ఎల్లుండి తిరుపతి ఎస్వీ వర్సిటీ స్టేషన్ కు రావాలని భూమనను పోలీసులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో భూమన గతంలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటారా, తగిన ఆధారాలు సమర్పించి ప్రభుత్వాన్ని ఇరుకునపెడతారా, లేక టీటీడీ ఈ ఆరోపణలు తప్పని నిరూపిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
గతంలో మూడు నెలల్లో ఎస్వీ గోశాలలో 100కు పైగా ఆవులు చనిపోయాయని భూమన ఆరోపించారు. అయితే ఇది అసత్య ప్రచారం అని ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇప్పుడు పోలీసుల విచారణ తర్వాత ఆవుల మృతి నిజమని తేలితే ఏమవుతుంది, లేక తప్పని పోలీసులు నిరూపిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. భూమన విచారణ తర్వాత ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

