వామ్మో.. ఇల్లు క్లీన్ చేస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయా..? తెలిస్తే షాకే…

రాష్ట్రవార్త :
మహిళలు ఉండే ఇండ్లు ఎప్పుడూ క్లీన్‌గా ఉంటాయి. లేకపోతే వారికి నచ్చదు. కానీ ప్రతిరోజూ తమ ఇళ్లను శుభ్రం చేసే మహిళలు పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ ఈ అలవాటు మీ ఊపిరితిత్తులను దెబ్బతీయవచ్చు. అది ఎలానో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సాధారణంగా మహిళలు తమ ఇళ్లను రోజూ శుభ్రం చేస్తుంటారు. ఇల్లు పరిశుభ్రంగా, మెరుస్తూ ఉండడం, మంచి సువాసన వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే శుభ్రం చేయడానికి వాడే కొన్ని స్ప్రేలు మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మన ఊపిరితిత్తులకు హానికరమని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. ఇది రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు తాగినంత ప్రమాదకరమని ఆ నివేదిక పేర్కొంది.
ఈ పరిశోధనలో నార్వేలోని బెర్గెన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సుమారు 34 సంవత్సరాల సగటు వయస్సు గల 6వేల మందిపై రెండు దశాబ్దాల పాటు అధ్యయనం చేశారు. ఈ క్లీనింగ్ స్ప్రేలను క్రమం తప్పకుండా ఉపయోగించే మహిళల ఊపిరితిత్తుల పనితీరు నెమ్మదిగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ స్ప్రేల వల్ల ఊపిరితిత్తులలో కలిగే మార్పులు రోజుకు 20 సిగరెట్లు తాగే మహిళల ఊపిరితిత్తుల మాదిరిగానే ఉన్నాయని అధ్యయనం తెలిపింది. క్లీనింగ్ స్ప్రేలు, ఉత్పత్తుల నుండి వచ్చే చిన్న కణాలు శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. వాటిని రోజూ ఉపయోగించేవారికి ఆ ప్రభావం వెంటనే తెలియకపోవచ్చు, కానీ దీర్ఘకాలికంగా చూస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది.
వారానికి ఒక్కసారి శుభ్రపరిచే ఉత్పత్తులను వాడినా ప్రమాదమేనని మరొక అధ్యయనం కనుగొంది. వారానికి ఒకసారి నేలలను శుభ్రం చేయడానికి క్రిమిసంహారకాలను ఉపయోగించే నర్సులకు ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే ప్రమాదం 24 నుండి 32 శాతం ఎక్కువగా ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది.
ఎలా శుభ్రం చేయాలి..? మీ ఇంటిని శుభ్రం చేయడానికి ఎక్కువగా నీరు లేదా మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించండి. మీరు క్లీనింగ్ స్ప్రేలను ఉపయోగిస్తున్నప్పుడు, గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. వీలైనంతవరకు స్ప్రేలను వాడటం మానుకోండి. ఒకవేళ వాడాల్సి వస్తే ఫేస్ మాస్క్ ధరించండి.

