When should you walk? Before or after meals? Do you know what the experts say?

వాకింగ్ మన హెల్త్‌ కి ఎంత బెనిఫిట్ అనేది అందరికీ తెలుసు. ఇది ఒక పవర్‌ ఫుల్ వ్యాయామం.. గుండెకు మంచిది, స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. అయితే చాలా మందికి వచ్చే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే.. అసలు ఈ వాకింగ్‌ ను ఎప్పుడు చేయాలి..? ఖాళీ కడుపుతో వాకింగ్ చేయాలా..? లేక తిన్న తర్వాత నడవడం ఇంకా మంచిదా..? ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది.
వాకింగ్ ఆరోగ్యం కోసం చేసే వ్యాయామాల్లో సులభమైంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఉల్లాసంగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణ సాధ్యమవుతుంది. అయితే వాకింగ్ ఎప్పుడు చేయాలి అనే దానిపై చాలా మందికి సందేహాలుంటాయి. భోజనానికి ముందు వాకింగ్ మంచిదా..? లేక భోజనం తర్వాత చేయాలా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో వాకింగ్

ఉదయాన్నే నిద్రలేవగానే ఖాళీ కడుపుతో కాసేపు వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి శక్తిగా మారుతుంది. దీన్ని ఫాస్టెడ్ కార్డియో అంటారు. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఉదయపు వాకింగ్ మనసుకి ప్రశాంతతను ఇస్తుంది. భోజనానికి ముందు వాకింగ్ చేసే వారికి ఆకలి నియంత్రణ సులభం అవుతుంది. దీంతో ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది.

మానసిక ఆరోగ్యం

వాకింగ్ మెదడును చురుకుగా ఉంచుతుంది. హార్మోన్లు సమతుల్యం అవుతాయి. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనానికి ముందు కాసేపు వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. పని చేసే వారికి ఇది మంచి మానసిక విశ్రాంతినిస్తుంది.

భోజనం తర్వాత వాకింగ్

ప్రాచీన ఆచారాల ప్రకారం.. భోజనం చేశాక కొద్దిసేపు నెమ్మదిగా వాకింగ్ చేయడం జీర్ణక్రియకు మంచిది. ఆధునిక సైన్సు కూడా ఇదే చెబుతోంది. భోజనం చేసిన 15 నిమిషాల్లోపు వాకింగ్ చేయడం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

గ్లూకోజ్ నియంత్రణకు వాకింగ్

మీరు వేగంగా నడవకపోయినా.. భోజనం చేశాక చేసే వాకింగ్ కండరాలకు ఆహారంలోని గ్లూకోజ్‌ ను త్వరగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ప్రత్యేకంగా రాత్రిపూట డిన్నర్ తర్వాత కాసేపు నడవడం మంచి నిద్రకు సహాయపడుతుంది.

జీర్ణక్రియ వేగవంతం

భోజనం తర్వాత వాకింగ్ చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, బరువుగా అనిపించడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారు కూడా తేలికపాటి వాకింగ్ తో ఉపశమనం పొందవచ్చు. అయితే వేగంగా వాకింగ్ చేయడం మాత్రం ఇబ్బందిగా మారవచ్చు.

సమయం కాదు.. క్రమశిక్షణే ముఖ్యం

ప్రతి రోజు ఒకే సమయంలో వాకింగ్ చేయడం కంటే.. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడమే ముఖ్యమని గుర్తుంచుకోండి. ఉదయం వాకింగ్ వల్ల కొవ్వు తగ్గుతుంది. భోజనం తర్వాత వాకింగ్ వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగ్గా ఉంటుంది. రెండింటినీ కలిపి చేయడం మరింత మంచిది.

మరికొందరు నిపుణులు ప్రతీ భోజనం తర్వాత 10 నిమిషాల వాకింగ్ ను సూచిస్తున్నారు. దీన్ని పోస్ట్ ప్రాండియల్ వాక్ అంటారు. దీని వల్ల శరీరానికి ఎక్కువ శ్రమ లేకుండానే మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

మార్నింగ్ వర్సెస్ నైట్ వాకింగ్

ఉదయాన్నే సూర్యరశ్మిలో వాకింగ్ చేయడం వల్ల శరీరంలో మెలటోనిన్ స్థాయి సమతుల్యం అవుతుంది. ఇది రాత్రిపూట మంచి నిద్రకు సహాయపడుతుంది. కొవ్వును కరిగించడానికి కూడా ఉదయపు వాకింగ్ తోడ్పడుతుంది. ఇక రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేయడం జీర్ణక్రియకు మంచిది. నిద్రకు ముందు మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

డయాబెటిస్, PCOS ఉన్నవారికి మేలు

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు భోజనం తర్వాత కాసేపు వాకింగ్ చేసినప్పుడు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యంగా ఉండే అవకాశం ఉంది. PCOS ఉన్న మహిళలు కూడా ఈ అలవాటుతో మంచి మార్పులు చూడవచ్చు.

మీరు వాకింగ్ ను ఎప్పుడైతే చేయాలనుకుంటారో ఆ సమయాన్నే ఎంచుకోండి.. ఉదయం అయినా, భోజనం తర్వాత అయినా.. ముఖ్యంగా ప్రతి రోజు వాకింగ్ అలవాటు చేసుకోవడం ప్రధానం. ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టాలి. ప్రతి రోజు కొంతసేపు వాకింగ్ చేయడం వల్ల మీ శరీరం, మనసులో అద్భుత మార్పులు చూడొచ్చు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *