హీరో విశాల్‌కు ఏమైంది..?

తమిళ స్టార్ హీరో విశాల్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్ వేదికపై ఉండగానే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆయన సిబ్బంది ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందారు.అయితే, ఈ విషయంపై తాజాగా విశాల్ మేనేజర్ స్పందించారు. ఆయన మధ్యాహ్నం భోజనం చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
సమయానికి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించారని కూడా ఆయన వెల్లడించారు. మేనేజర్ ఈ విషయం తెలియజేయడంతో విశాల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి వారి అభిమాన హీరో ఆరోగ్యంగా ఉన్నారన్న వార్త వారికి ఎంతో ఊరటనిచ్చింది.

News by : V.L
