కార్మికుడి కుమార్తెను సత్కరిస్తున్న వీరనారాయణ, వెంకటేశ్వరరావు

ఆర్ధికంగా ఉన్నత స్థానానికి ఎదగాలని చూసే ఈ రోజుల్లో తన కార్మికుడి కుటుంబానికి చేయూతనిచ్చిన కాటూరి వెంకటేశ్వరరావు ఆదర్శప్రాయులని వివేక విద్యాసంస్థల చైర్మెన్ వీరనారాయణ అన్నారు. ఆదివారం రూరల్ పరిధిలోని కొలకలూరు గ్రామంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీని ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు భాస్కరానంద సరస్వతి తో కలసి వీరనారాయణ సందర్శించారు. తమ వద్ద రూపొందిన కళాఖండాలను తిలకిస్తూ వీరనారాయణ మంత్ర ముగ్ధులయ్యారు. ఇటీవల ఆర్ట్ గ్యాలరీలో కొలువుతీరిన శివాజీ మహారాజ్ భారీ మండపాన్ని చూస్తూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తమ శిల్పాలలో 30 ఏళ్లుగా కార్మికుడిగా పనిచేస్తున్న శివయ్య కుటుంబసభ్యులను సన్మానించారు. శివయ్య కుమార్తె పద్మావతి ఉన్నత చదువులకు చేయూతనిచ్చిన కాటూరి వెంకటేశ్వరరావును అభినందించి సన్మానించారు. 15 ఏళ్ళక్రితం వెంకటేశ్వరరావు చేసిన ఆర్థికసాయం నేడు లండన్ లో పెద్ద సంస్థలో స్థిరపడడానికి దోహద పడినట్లు పద్మావతి ఆనందం వ్యక్తం చేశారు. వీరనారాయణ మాట్లాడుతూ తాము ఆర్థికంగా ఎదగాలని ఆలోచించే ఈ రోజుల్లో తమ కార్మికుడి కుటుంబానికి చేయూతనివ్వడం ఆదర్శప్రాయమని కాటూరి ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు కాటూరి వెంకటేశ్వరరావుని అభినందించారు. గత 30 ఏళ్లగా తన వద్ద పనిచేస్తున్న శివయ్య కుమార్తె పద్మావతి ఉన్నత చదువులకు ఆరోజుల్లో ఆర్థికసాయం చేయడం, చేసిన ఆర్ధిక సహాయం ద్వారా ఆమె ఉన్నత స్థానాలకు చేరుకుని లండన్ లో స్థిరపడటం ఓ మంచి పరిణామమని వీరనారాయణ అన్నారు. ఓ సదుద్దేశంతో చేసిన సహాయానికి తిరిగి కృతజ్ఞత తీర్చుకోవడానికి ఆమె ఉపక్రమించడం వారి అభిమానం దార్శనికత కు నిలువెత్తు నిదర్శనం అన్నారు. భారతదేశం గర్వించదగ్గ కళాఖండాలను రూపొందించడమే కాకుండా పలువురికి ఆర్ధిక సహాయం అందిస్తున్న వెంకటేశ్వరరావు సేవలను డాక్టర్ రామరాజు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు వేజెండ్ల ఉమామహేశ్వరరావు కొనియాడారు. కార్యక్రమంలో కాటూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, కాటూరి కొండమ్మ, రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

