Unyielding Dignity: The Legend of Sri Vasavi

ప్రాణానికన్నా ఆత్మగౌరవమే ముఖ్యమని చాటిన భారత వీరనారి శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి

వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్ఠి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు (విమలాదిత్య మహారాజు) అనే చక్రవర్తి ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10, 11వ శతాబ్దాలలో కుసుమ శ్రేష్ఠి సుమారు 18 పరగణాలను జ్యేష్టశైలం/బృహత్ శిలా నగరం (పెనుగొండ) ను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు.

కుసుమశ్రేష్ఠి, ఆయన భార్య కుసుమాంబ ఆదర్శవంతమైన జీవనాన్ని గడుపుతూ ఉండేవారు. నగరేశ్వరస్వామి (శివుడు) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయి ఎన్నో సంవత్సరాలైనా… సంతాన ప్రాప్తి లేనందువలన పుత్ర కామేష్టి యాగం చేయగా, ఆ యజ్ఞప్రభావంతో కొన్ని రోజులకే కుసుమాంబ గర్భవతి అయినది.

వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడపిల్ల, మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరూపాక్షుడు అని, అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేసారు.

బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.

రాజగురువు భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాడు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తిసాము మొదలైన యుద్ధవిద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.

అదే రోజు ఆదిపరాశక్తి పూజకు మంగళ వాద్యాలతో వెళ్తున్న వాసవిని విష్ణువర్ధనుడు చూసి మోహించి వివాహమాడదలచాడు. కుసుమశ్రేష్ఠికి వర్తమానం పంపాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి, వాసవి దివ్య బాలికయని, కావున వివాహం సమ్మతం కాదని తెలుపగా ఒక నెల రోజుల వ్యవధినిచ్చి వివాహానికి సమ్మతించనిచో సైన్యంతో యుద్ధం చేసి బలవంతంగా వాసవిని తీసుకొని పోతానన్నాడు.

అలాగే, వాసవి కూడా తను జీవితాంతం కన్యగానే ఉంటాననీ, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది.

కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.

ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుసుమశ్రేష్ఠి రాజగురువు భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ఆ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి.

102 గోత్రాలకు చెందిన ముఖ్యులు, “పిరికివారు ప్రతి రోజు మరణిస్తారు, పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం వస్తుంది, కాబట్టి పోరాటమే సరైనది” అని అభిప్రాయ పడగా మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం వాసవికి విష్ణువర్ధనుడితో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.

తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికీ, తన కూతురిని విష్ణువర్ధనుడికి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు. ఈ విషయం తెలిసిన విష్ణువర్ధనుడు తన సమస్త సేనలను కూడదీసుకుని యుద్దానికి సంసిద్ధం అయ్యాడు.

ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వైశ్యులు కుసుమశ్రేష్ఠికి అండగా నిలిచారు. నాటి సమావేశంలో మొదటిసారిగా వాసవాంబిక తన ప్రతిస్పందనను సభాపూర్వకంగా తెలియచేసింది.

నా వల్ల ఇంత రక్తపాతం జరుగకూడదు. నా కోసం అందరూ ఎందుకు రక్తం చిందించాలి? నా స్వార్ధం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం.

ఆతర్వాత, వాసవి సూచనలను అనుసరించి, ఒకానొక మాఘ శుద్ధ పాడ్యమి రోజు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది.

ఆసందర్భంలో వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి, తమకి ఆమె యొక్క నిజ స్వరూపాన్ని చూపమని కోరారు. దానికి ఆమె చిరుమందహాసంతో దేదీప్యమానమైన వెలుగులతో తన నిజ స్వరూపాన్ని చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది.

కలియుగంలో ధర్మాన్ని నిల్పేందుకు, మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధనుడు వంటి మానవరూప రాక్షసులను అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది.

సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది.

ఆమె అక్కడ చేరిన వారందరికీ దేశభక్తి, నిజాయితీ, మానవసేవ మరియు సమాజ సేవ, సహనం మొ|| వాటి గురించి వివరించింది.

అప్పుడు 102 గోత్రాలకు చెందిన వారు కూడా తమ ఇష్ట దైవాలను తల్చుకుంటూ మరియు జై వాసవి, జై జై వాసవి అని బిగ్గరగా అరుస్తూ అగ్నిగుండంలోకి దూకారు.

తన సేనతో పెనుగొండ పొలిమేరల్లోకి ప్రవేశించిన విష్ణు వర్ధనుడు వాసవి ప్రాణత్యాగం గురించిన వార్త విన్న వెంటనే రక్తం కక్కుకుని, తలపగిలి మరణించాడు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణ పొలిమేరలకు చేరుకుని విలపించాడు. ఆ తర్వాత వాసవి యొక్క సోదరుడు విరూపాక్షుడు వచ్చి అతన్ని ఈ విధంగా ఓదార్చాడు – “సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాఠంగా నేర్చుకుని భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవాంబిక మన అందరిని రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది అని.”

రాజరాజ నరేంద్రుడు వాసవాంబిక గౌరవార్ధం పెనుగొండలో ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పటి నుండి ఆర్య వైశ్యులందరూ వాసవీ కన్యకా పరమేశ్వరి ని దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top