క్రిస్మస్ వీక్ లో చాలా సినిమాలు విడుదలయ్యాయి. కానీ రెండు సినిమాలు సరైన సక్సెస్ ను నమోదు చేసుకున్నాయి. సినిమాల సక్సెస్ కు కొలమానం పెట్టిన పెట్టుబడి వెనక్కు రావడం తప్ప ఇంకేం వుంటుంది. ఈ లెక్కన ఈ వారం విడులదైన రెండు సినిమాలు ఈషా, శంబాల సక్సెస్ అయిపోయాయి.
శంబలా సినిమాలు 10 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినల్ అడ్వాన్స్ లు తీసుకుని విడుదల చేసారు. ఏపి, సీడెడ్ కలిపి తీసుకున్న అడ్వాన్స్ జస్ట్ కోటి రూపాయలు మాత్రమే.
ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజులకు కోటిన్నరకు దాదాపు దగ్గరగా వసూలు చేసింది. అంటే తీసుకున్న అడ్వాన్స్ చెల్లు అయిపోయింది. ఖర్చులు కూడా అయిపోయాయి. ఇక ఏమి వచ్చినా నిర్మాతలకు అదనంగా అందుతుంది. నైజాంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడా కోటి రూపాయలు తీసుకుని విడుదల చేసారు. ఆ డబ్బులు వెనక్కు వచ్చేసాయి. ఇంకా పది రోజులు రన్ వుంటుంది. పండగ సీజన్ లో కూడా ఒకటి అర థియేటర్లు వుండనే వుంటాయి కనుక ఎంతో కొంత షేర్ వస్తుంది.
అలాగే ఈషా సినిమాను జస్ట్ రెండు కోట్ల వ్యయంతో నిర్మించారు. ఖర్చులు పెట్టుకుని పంపిణీ చేయమని బన్నీవాస్, వంశీ నందిపాటికి ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల దగ్గరగా వసూళ్లు సాధించింది. అంటే ఖర్చులు అయిపోయాయి. కమిషన్ పోగా అంతో ఇంతో నిర్మాతకు వెళ్తుంది. ఇకపై ఏ మేరకు రన్ వున్నా అది నిర్మాతకు వెళ్తుంది. టోటల్ రన్ లో రెండు కోట్లు ఓవర్ ఫ్లో వస్తే చాలు నిర్మాత గట్టెక్కేసినట్లే.
2025లో ఇలా చిన్న సినిమాలు సేఫ్ కావడం అన్నది తరచుగా జరుగుతోంది. రెండు నుంచి రెండున్నర కోట్ల వ్యయంతో తీసినవి, పది నుంచి పదిహేను కోట్ల మధ్య వ్యయంతో తీసినవి చాలా మంచి హిట్ లు అయ్యాయి. ఈ ట్రెండ్ ను పట్టుకుంటే, మంచి కంటెంట్ తో, తక్కువ వ్యయంతో సినిమా తీసినా జనం ఆదరిస్తారు అనే నమ్మకాన్ని మరింత పెంచవచ్చు.

