TTD’s key announcement for devotees going to Tirumala… Changes in tickets and darshan timings

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలలో శ్రీవాణి టికెట్ల జారీ, దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు ఆఫ్‌లైన్‌లో పొంది శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం వారి ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పులు చేస్తున్న‌ట్లు టీటీడీ అద‌నపు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లోని గోకులం స‌మావేశ మందిరంలో ఆయ‌న శ్రీ‌వాణి దర్శ‌నాల‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్రస్తుత విధానం వలన శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా మూడు రోజుల సమయం పట్టేది. వారి సౌకర్యార్థమై ఏ రోజు కారోజు టికెట్ జారీ చేసి, దర్శనం కల్పించడంపై టీటీడీ దృష్టిపెట్టింది. ప్రయోగాత్మకంగా ఆగస్టు 1 నుండి 15 వరకు టీటీడీ అమలు చేయనుంది. తిరుమ‌ల‌లో ఉద‌యం 10 గంట‌ల నుండి మొద‌ట‌ వ‌చ్చిన వారికి మొద‌టి ప్రాతిప‌దిక‌న శ్రీవాణి టికెట్లు జారీ చేస్తారు. టికెట్లను పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమ‌ల‌లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వ‌ద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు రిపోర్టింగ్ స‌మ‌యం ఉంటుంది.

తిరుమ‌ల‌లో ఆఫ్‌లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్ర‌యంలో 200 టికెట్లు జారీ చేస్తారు. రేణిగుంట విమానాశ్ర‌యంలో ఉద‌యం 7 గంట‌ల నుండి ద‌ర్శ‌న టికెట్లు కోటా ఉన్నంతవరకు జారీ జరుగుతుంది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్స్ తీసుకున్న భక్తులకు మధ్యాహ్నం లోగా దర్శనం పూర్తవుతుంది. కానీ ఆగస్ట్ 1 నుంచి కొత్త విధానం వల్ల దర్శనం సాయంత్రం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్ ఫుల్లుగా ఉండే కూరగాయ ఇదే… ఈ సీజన్‌లో మాత్రమే దొరుకుతుంది

ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో అక్టోబ‌ర్ 31వ తేది వ‌ర‌కు శ్రీ‌వాణి టికెట్లను పొందిన భ‌క్తుల‌కు య‌థావిధిగా ఉద‌యం 10 గంట‌ల‌కే ద‌ర్శ‌నానికి అనుమ‌తి వెసులుబాటు ఉందన్నారు. న‌వంబ‌ర్ 1వ తేది నుండి శ్రీ‌వాణి టికెట్ల‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం నాలుగున్నర గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. భ‌క్తులు ముందుగా కౌంట‌ర్ల వ‌ద్ద‌కు చేరుకుని, తాము ఇబ్బంది ప‌డ‌కుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ చేసే ప్రదేశం వద్దకు చేరుకోవాలన్నారు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *