ప్రధాని మోదీకి డెడ్ లైన్ పెట్టిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందనే విషయాన్ని మోదీ తనతో చెప్పారని వెల్లడించారు. ఈ ప్రక్రియ దశలవారీగా సాగుతుందని, ఏడాది చివరి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులు దాదాపు జీరోకు చేరుతాయని ట్రంప్ అంచనా వేశారు. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో రష్యా వాటా 40 శాతంగా ఉంది.
అకస్మాత్తుగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపలేకపోవచ్చని, ఈ సంవత్సరం చివరి నాటికి దశలవారీగా ఇది అమలులోకి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ కొనుగోళ్లు దాదాపు జీరో స్థాయికి చేరకుంటాయని వ్యాఖ్యానించారు. దాదాపు 40 శాతం చమురు కొనుగోళ్లను భారత్ తగ్గిస్తుందని పునరుద్ఘాటించారు. ఈ విషయంపై ప్రధాని మోదీ తనకు మాటిచ్చాడని వివరించారు. పనిలో పనిగా భారత్ ఎంతో గొప్ప దేశమని ఆయన ప్రశంసించారు.
అంతకు ముందు- రష్యాలోని రెండు అతిపెద్ద చమురు కంపెనీలైన రోస్‌నెఫ్ట్ (Rosneft), లుకోయిల్ (Lukoil) లపై అమెరికా ఆంక్షలు విధించింది. క్రెమ్లిన్ యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూరుస్తున్నందుకు ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో శాంతి ప్రక్రియకు రష్యా తగినంత నిబద్ధత చూపట్లేదని, అందుకే ఈ ఆంక్షలను విధించినట్లు పేర్కొంది. ఈ ఆంక్షలు రష్యా ఇంధన రంగాన్ని దెబ్బతీస్తాయని, తద్వారా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని తెలిపింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కు సంబంధించినవి రోస్‌నెఫ్ట్, లుకోయిల్ కంపెనీలు. క్రూడాయిల్, సహజ వాయువు నిక్షేపాలను అన్వేషించడం, వాటిని వెలికి తీయడం, శుద్ధి- రవాణా, విక్రయాల వంటి కార్యకలాపాల కొనసాగిస్తోన్నాయి. రష్యాలో అతిపెద్ద క్రూడాయిల్ కంపెనీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.
ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో కూడా ప్రస్తావించారు డొనాల్డ్ ట్రంప్. ఆంక్షలు విధించడాన్ని బిగ్ డే గా అభివర్ణించారు. ఇవి చాలా భారీ ఆంక్షలని చెప్పారు. రష్యాకు చెందిన ఈ రెండు అతి పెద్ద ఆయిల్ కంపెనీలపై ఆంక్షలను విధించడం వల్ల యుద్ధానికి శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కిందటివారం దాదాపు 8,000 మంది రష్యన్, ఉక్రెనియన్ సైనికులు మరణించారని ఆయన గుర్తు చేశారు.
