దుర్గాదేవి మండపంలో రాక్షసుడిగా ట్రంప్.. ఎక్కడంటే..?

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ పై ఏకంగా 50 శాతం టారిఫ్ లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై 50 శాతం టారిఫ్ లు అమలవుతూ వస్తున్నాయి. అలాగే ఇటీవల H-1B వీసా దరఖాస్తు ఫీజును పెంచుతూ ట్రంప్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై H-1B వీసా అప్లికేషన్ ఫీజు లక్ష డాలర్లు (దాదాపు రూ. 88 లక్షలు) వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ ఫీజు కేవలం రూ. ఒక లక్ష నుంచి రూ.6 లక్షల మధ్య మాత్రమే ఉండేది. దీంతో కొత్తగా భారత్ నుంచి అమెరికా వెళ్లేవారికి ఇబ్బందులు తప్పేలా లేవు.
అటు భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుందుడుగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు మన దేశంలోని పశ్చిమ బెంగాల్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఇటీవల దేవీ నవరాత్రుల సందర్భంగా బెంగాల్ లోని బహరంపూర్ లోని ఖగ్రా ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను రాక్షసుడిగా రూపొందించారు. ట్రంప్ ఇక్కడరాక్షస రూపంలో ఉన్నారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వెళ్తున్నారు.
ట్రంప్ భారత్ పై వివక్ష చూపిస్తున్నారని అందుకే భారత్ పట్ల వ్యతిరేక భావంతో ప్రవర్తిస్తున్న ట్రంప్ ను రాక్షస రూపంలో ఉంచి, దుర్గామాత అతన్ని సంహరిస్తున్నట్లుగా విగ్రహాన్ని రూపొందించామని పూజా మండపం కమిటీ నిర్వహకులు తెలిపారు. ఈ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది.

