టమాటా ధరలు భారీగా ఢమాల్.. కిలోకి రూ. 1 .. రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితి..

తాము ఎంత కష్టపడి పండించినా, దానికి సరైన ధర దక్కకపోవడం వల్ల పంటను రోడ్డుపై పారబోసి ఆందోళన చేపట్టారు.కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్‌లో టమాటా రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పండగకు ముందు వరకూ కిలో రూ.8 నుంచి రూ.10 వరకు అమ్ముడవుతున్న టమాటా ధరలు ఆదివారం ఒక్కసారిగా కిలోకు రూ.4 వరకు పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎంత కష్టపడి పండించినా, దానికి సరైన ధర దక్కకపోవడం వల్ల పంటను రోడ్డుపై పారబోసి ఆందోళన చేపట్టారు.
సమాచారం ప్రకారం, మార్కెట్‌లో టమాటా సరఫరా అధికమవ్వడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటకు వచ్చిన డబ్బులకు సరిపడా ఖర్చులు కూడా తీరడం లేదని వారు వాపోతున్నారు. మార్కెట్ కమిషన్, కోత కూలీల వేతనాలు, రవాణా ఖర్చుల కలిపి వచ్చిన మొత్తం సొమ్ములోనే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

