కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వీకెండ్, సెలవుల ప్రభావంతో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex) లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తుల క్యూ లైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కొనసాగుతోంది.
టైమ్ స్లాట్ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం కలగడానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. ఈ మేరకు రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు క్యూ లైన్లలో నిరంతరం పర్యవేక్షిస్తూ, తాగునీరు, అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. శనివారం స్వామి వారిని 82,043 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే స్వామి వారికి రూ.3.74 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

