రూ.లక్ష లోపు టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Top 5 Electric Scooters: ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా వీటి డిమాండ్ భారీగా పెరిగింది. అయితే మార్కెట్లో వివిధ ధరలు, ఫీచర్లలో అనేక ఎంపికలు అందుబాటులో ఉండటంతో సరైన స్కూటర్ ను ఎంచుకోవడం వినియోగదారులకు కొంత గందరగోళంగా మారవచ్చు. మీరు రూ.లక్ష లోపు తక్కువ బడ్జెట్లో మెరుగైన రేంజ్, ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ కథనం మీ కోసమే. ఈ బడ్జెట్లో లభించే టాప్ 5 స్కూటర్ల గురించి, వాటి ప్రత్యేకతలు, ధరలు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1.టీవీఎస్ ఐక్యూబ్( TVS iQube -ఎంట్రీ-లెవెల్ వేరియంట్) టీవీఎస్ నుంచి వస్తున్న ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ ఈ బడ్జెట్లో ఓ బెస్ట్ ఛాయిస్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.94,434గా ఉంది. ఈ స్కూటర్‌లో 2.2 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంది. ఇది 94 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌ను అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 5-అంగుళాల TFT కన్సోల్ (స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో), ఈకో, పవర్ అనే రెండు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. నడపడానికి సులువుగా, సౌకర్యవంతంగా ఉండటం ఈ స్కూటర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
2. ఓలా ఎస్1 ఎక్స్(Ola S1 X) ఓలా ఎలక్ట్రిక్ లైనప్‌లో అత్యంత చౌకైన స్కూటర్ గా ఓలా ఎస్1 ఎక్స్(Ola S1 X) నిలుస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.94,999. ఈ ధరలో 2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అందుబాటులో ఉంది. దీని క్లెయిమ్డ్ రేంజ్ 108 కిలోమీటర్లు కాగా.. టాప్ స్పీడ్ 101 kmph వరకు ఉంటుంది. ఇందులో 7 kW మిడ్-డ్రైవ్ మోటార్‌ను ఉపయోగించారు. ఇందులో 4.3-అంగుళాల LCD కన్సోల్, ఈకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీ (టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో) వంటి ఫీచర్లు లభిస్తాయి.
3. వీడా వీ2 ప్లస్(Vida V2 Plus) హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ విభాగం వీడా (Vida) నుంచి వచ్చిన V2 Plus ఈ బడ్జెట్‌లో ఎక్కువ రేంజ్ అందించే స్కూటర్‌గా ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.85,300. ఈ స్కూటర్‌లో 3.44 kWh బ్యాటరీ ఉంది. దీని ARAI-సర్టిఫైడ్ క్లెయిమ్డ్ రేంజ్ ఏకంగా 143 కిలోమీటర్లు. 7-అంగుళాల కన్సోల్, కీ-లెస్ స్టార్ట్-స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 6 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు, ఈకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లు ఇందులో అందించబడ్డాయి.
4.ఆంపియర్ మాగ్నస్ నియో(Ampere Magnus Neo) ఈ జాబితాలో అత్యంత తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ మాగ్నస్ నియో. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.84,999. ఇందులో 2.3 kWh LFP బ్యాటరీ ప్యాక్ ఉంది. దీని క్లెయిమ్డ్ రేంజ్ 85-95 కిలోమీటర్లు, టాప్ స్పీడ్ 65 kmph. ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా నిలిపే అంశం ఏమిటంటే, కంపెనీ ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ వారంటీ (5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్లు) అందిస్తుంది. దీనివల్ల ఇది చాలా మందికి నమ్మదగిన, ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుంది.
5. టీవీఎస్ ఆర్బిటర్(TVS Orbiter) టీవీఎస్ నుంచి కొత్తగా వచ్చిన ఆర్బిటర్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.05 లక్షలు. అయితే PM E-Drive స్కీమ్ వంటి ప్రభుత్వ రాయితీలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది రూ.1 లక్ష లోపు లభించే అవకాశం ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో 3.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది 158 కిలోమీటర్ల అత్యధిక క్లెయిమ్డ్ రేంజ్‌ను అందిస్తుంది. క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ కంట్రోల్, 5.5-అంగుళాల LCD కన్సోల్, USB ఛార్జింగ్, OTA అప్‌డేట్స్ వంటి ఆధునిక ఫీచర్లను ఈ కొత్త TVS ఎలక్ట్రిక్ స్కూటర్ కలిగి ఉంది.


Don’t Buy Ola.