అర్ధరాత్రి సమయంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి వేళల్లో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని గట్టిగా వర్షం పడింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇదే సమయంలో నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో కూడా రాత్రి వర్షం కురిసింది. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకార..బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావం ఇంకా కొనసాగనున్నందున రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే రైతులు పంటల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

