Sri Varasiddhi Vinayakaswamy Temple (Kanipakam)

వినాయక దేవాలయం లేదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో నెలకొని ఉన్న హిందూ వినాయక దేవాలయం.  ఇది చిత్తూరు నుండి 11 కి.మీ దూరంలోనూ, తిరుపతి నుండి 68 కి.మీ దూరంలోనూ ఉంది.

చారిత్రిక కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారిలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి ఏతాంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూచాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది స్థానిక కథనం. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది.

ఆలయంలో వినాయకుని దేవుడు

ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళ రాజు మొదటి కుళుత్తుంగ చోళుడు నిర్మించాడు. 1336 తరువాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేసారు. 

ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధ్వర్యంలో ఉంది. ఈ దేవాలయ నిర్వహణ కొరకు 15 సభ్యులతో కూడిన ట్రస్టీ ఉంది. 

వినాయక చవితి పండగ నుండి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఈ వేడుక చూడటానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు సందర్శిస్తారు. [4]

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. 

దీనికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు, ఒక వినూతమైన మండపం ఉన్నాయి.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *