Sravana Kumar’s granddaughter, Srivasavidevi:-

పూర్వం త్రేతాయుగంలో పద్మాక్షుడు అనే ఆర్యవైశ్యయువకుడు గురుకుల పాఠశాలలో చతుర్వేదాలను అభ్యసిస్తున్నాడు.
అక్కడ ‘విద్యావతి’ అనే ఒక శూద్రకన్య ఆశ్రమ సేవకురాలిగా ఉండేది.
ఒక రోజున గురువుగారు అడిగిన వేదంలోని ఒక చిక్కు ప్రశ్నకు, అక్కడి విద్యార్థులెవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు, అప్పుడు శూద్రకన్య అయిన విద్యావతి, వేదం సుమధుర సుందరగానంతో ఉదాత్త, అనుదత్తములతో పాడటాన్ని గమనించిన గురువులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

పండితులవారు ఆశ్చర్యంతో నీవు శూద్రకదా! వేద రహస్యం నీకు ఎలా తెలిసింది?” అన్నాడు. అప్పుడు ఆమె”బాల్యం నుండి ఇక్కడ పనిచేస్తున్న నేను ప్రతిరోజూ మీరు చెప్పే వేదపాఠం విని అభ్యసించాను అనీ, మీరు అనుమతిస్తే మరికొంత వేదాలని పఠించాలని కోరిక” అన్నది.

ఆమాటకు ఆగ్రహించిన గురువులు, అసలు శూద్రులకు వేదం వినే అర్హత లేదు. నిన్ను వెంటనే గురుకుల సేవ నుండి తొలగిస్తున్నాను, ఇక్కడి నుండి వెళ్ళమని, పండితులు బయటకు గెంటబోయారు.

అప్పుడు అక్కడ ఆర్యవైశ్య విద్యార్థి యువకుడైన ‘పద్మాక్షుడు’ అమెను చేరదీసి, ప్రక్కనే ఉన్న దేవతావిగ్రహం మెడలోని మంగళసూత్రం చేతి కందుకని
ఆ గురువుల ముందే ఆమెను వివాహం చేసుకున్నాడు.
ఇప్పుడు ఈమె నాభార్య కనుక, వేదార్హత కల్పించండి” అన్నాడు. అందుకు కుపితుడైన పండితులు వారు “ఓరీ! గురుద్రోహి.. శూద్రస్త్రీని వివాహమాడిన మీరిద్దరూ వెంటనే గురుకులం విడిచి వెళ్ళిపోండి.
నీకు సంతానభాగ్యం లేక, వంశక్షయం జరుగుగాక, కాలగతిన మీరు అంధులగుదురుగాక!
అని ఊగ్రంతో శపించారు.

అలా పద్మాక్షుడు, విద్యావతికి వివాహమైన అనంతరం, వారికి సంతానం లేక బ్రహ్మదేవుని గూర్చి తపస్సు ఆచరించారు.
బ్రహ్మ ప్రత్యక్షమైనపుడు, మాకు ఒకపుత్రుని ప్రసాదించుమని కోరారు.
అపుడు బ్రహ్మ!
“ఓ వైశ్యదంపతులారా! మీకు గురుశాపం కారణంగా సంతానం కలిగే అవకాశం లేదు! అయినా మీరు నాకు ప్రియభక్తులైన కారణంగా ఒకపుత్రుని ప్రసాదించుతాను, అయితే
ఆ పుత్రునికి 5 సం॥లు వయస్సు వచ్చువరకూ మీరు పుత్రుని చూడకూడదు.
ఆలోపే మీరు పుత్రుని చూచినట్లైతే, మీ నేత్ర దృష్టిపోవుగాక! అని బ్రహ్మ శాసనం విధించాడు.
అప్పుడా వైశ్యదంపతులు యోచించారు. అసలు సంతానమేలేని దానికన్నా బిడ్డపుట్టిన 5 సం॥ల తరువాత మన పుత్రుని మనం చూడవచ్చును గదా! అనుకొని అలాగునే అనుగ్రహించుమని కోరారు, బ్రహ్మ “తథాస్తు” అన్నాడు..!

బ్రహ్మదేవుని అనుగ్రహంతో పద్మాక్షవిద్యావతి దంపతులకు శ్రావణమాస పౌర్ణమి శ్రవణానక్షత్రం రోజున ఒక పుత్రుడు జన్మించాడు.
శిశువు పుట్టిన తక్షణం అతని పినతల్లి ఇంటిలో పెంచసాగారు. వారింటికీ, వీరింటికి మధ్యన ఒక గోడ మాత్రమే అడ్డువున్నది.
రోజూ పద్మాక్ష దంపతులు తమ పిల్లవాని మాటలు గోడకు అటువైపునుండి విని శ్రవణం ద్వారా కుమారుడని ఆనందించిన కారణంగా అతనికి “శ్రవణకుమారుడ”ని పేరు స్థిరపడింది..!

అలా శ్రవణకుమారునికి 1వ సం॥రం, 2 సం॥రం, 3-4 సం॥లు వయస్సు నిండింది.
ఇక రేపటితో 5 సం॥లు వయస్సు నిండుతుందనగా ఆ 5 సం॥రం జయంతోత్సవ వేడుకలకు బంధువులందరూ వచ్చారు.
వారందరూ శ్రావణుని చూచి “ఆహా!
ఈ బాలుడు ఎంత అందంగా వున్నాడు, సాక్షాత్ ప్రహ్లాదుడు – ధృవునిలా వున్నాడు” అని బంధువులనుకొనే మాటలను గోడకు ఇవతల వున్న పద్మాక్షవిద్యావతి దంపతులు విన్నారు.
“ఆహా అలా వున్నాడా?
ఇలా వున్నాడా?.. అని ఆ పుత్రునిపై ప్రేమను ఆపలేక, తల్లి విద్యావతి గోడ తిరిగి ఈ వాటాలోకి వచ్చింది.
ఆమెను ఆపటానికి వచ్చిన పద్మాక్షుడు కూడా, ఆమెతోపాటు వచ్చాడు.
అలా ఆదంపతులిద్దరూ ఆ పిల్లవాణ్ణి చూడనే చూచారు! బ్రహ్మదేవుని శాసనం కారణంగా ఒకరోజు ముందుగానే చూచారు కనుక వారిద్దరూ అంధులైపోయారు!

అలా శ్రవణకుమారుడు పెరిగి పెద్దవాడైనాడు.
22 సం॥ల వయస్సు వచ్చింది. అతనికి “జ్ఞానేశ్వరి” అనే కన్యతో వివాహంచేశారు తల్లితండ్రులు. కొంతకాలం గడిచిన తరువాత శ్రవణకుమారునికి, జ్ఞానేశ్వరికి ఇద్దరు పురుషబిడ్డలు కవలలుగా జన్మించారు. ఆ బిడ్డలకు “సత్యవంతుడు, హేమవర్ణుడు” అనే పేర్లు పెట్టారు. అలా శ్రవణుని బిడ్డలకు కూడా 5 సం॥ల వయస్సు వచ్చింది..!
శ్రవణుడు తన బిడ్డల జయంతి రోజున వారిని చెరో చంకన యెత్తుకొని ఆనందంగా పాటలు పాడుతున్నాడు.
ఆ ఆనంద సమయంలో శ్రవణుని తల్లితండ్రులైన పద్మాక్షుడు, విద్యావతి దంపతులు ఒక ప్రక్కన నిలబడి దుఃఖిస్తున్నారు. ఆ దుఃఖాన్ని చూచి, శ్రవణకుమారుడు ఆశ్చర్యంతో..తల్లితండ్రుల దగ్గర కొచ్చి ఇలా అడుగుతున్నాడు..!
“తల్లితండ్రులారా..! నేను ఈనాడు ఇంత ఆనందంగా వుంటే.. మీరెందుకు దుఃఖిస్తున్నారు?” అన్నాడు.
అప్పుడా గ్రుడ్డిదంపతులు “నాయనా శ్రవణకుమారా! నీకు 5సం॥లు వయస్సువున్నప్పుడే నిన్నుచూడాలనివచ్చి మేము అంధులమైనాము. కానీ, ఆనాడు మేము నిన్ను చూడలేక పోయినా, ఈనాడు
నీ బిడ్డలను చూచే భాగ్యం లేకపోయిందే.! అని దుఃఖించారు.

అప్పుడర్ధమైంది శ్రవణకుమారునికి, ఓహో.. నా కారణంగానే మా తల్లితండ్రులకు నేత్ర దృష్టి పోయింది. కనుక మళ్ళీ నా కారణంగానే నేత్రాలు తెప్పించాలి! అని అనుకొని అనేకమంది మహర్షుల పాదాలపై నమస్కరించి నేత్రాలు వచ్చేమార్గం బోధించండని ప్రార్ధించాడు. అప్పుడు వారు “ఓ శ్రవణ కుమారా..!” నీవు ‘మీ తల్లితండ్రులను ‘కాశీకి తీసుకువెళ్ళి, ఆ జ్యోతిర్లింగమును చేతులతో ముట్టించి, కళ్ళకు అద్ది, నమస్కరిస్తే, వీరికళ్ళలో జ్యోతులు వెలిగి ప్రపంచం దర్శిస్తారు. కనుక కాశీదర్శనం చేయిస్తే, ఫలితం తప్పక కలుగు తుందన్నారు.
ఆ మాట విన్నవెంటనే శ్రవణకుమారుడు తన ఇద్దరు బిడ్డలను, భార్య జ్ఞానేశ్వరికి అప్పగించి, “ఓ భార్యమణీ..!
మా తల్లితండ్రులకు నేత్రాలు వస్తేనే నేను ఇంటికి తిరిగివస్తాను అని శపథంచేసి కాశీ ప్రయాణానికి సిద్ధమైనాడు..!
ఆ కాలంలో వాహనాలు ఏమీలేని కారణంగా ఒక కావిడి సిద్ధంచేసి వృద్ధ గ్రుడ్డి తల్లితండ్రులను కావిడిలో ముందువైపు తల్లినీ, వెనుకవైపు తండ్రిని కూర్చుండబెట్టుకొని శ్రవణకుమారుడు కాశీకి ప్రయాణమయ్యాడు..!
అలా రాత్రనకా.. పగలనకా.. కాశీప్రయాణం సాగిపోతుండగా, ఒక మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంవేళ అయోధ్య రాజ్యపరిసర ప్రాంతపు అరణ్యమార్గంగుండా ప్రయాణిస్తుండగా..!
ఈ వృద్ధ దంపతులకు దాహం కలిగింది! “నాయనా… శ్రవణా! దాహం.. దాహం” అన్నారు, వెంటనే శ్రవణుడు ఆ కావిడిని ఒక చెట్టు క్రింద దించి, నీళ్ళు తేవటానికి ఒక చిన్న కూజా తీసుకొని, కనుచూపు దూరంలోవున్న చెరువుదగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి చెరువులో నీళ్ళుముంచుతున్నాడు..!
అదే సమయంలో అరణ్యం ప్రక్కనేవున్న అయోధ్య రాజ్యచక్రవర్తి అయిన “దశరధ మహారాజు” ఆ అరణ్యానికి వేటకు వచ్చాడు.
ఒక ఖడ్గమృగం దశరధుని బాణం నుండి తప్పించుకొని శ్రవణకుమారుడు నీళ్ళు ముంచే చెరువు దగ్గర కొచ్చి.. ఒక పొదలో దాక్కున్నది. ఆ పొద దగ్గరకు వచ్చిన దశరథుడు బాణాన్ని ఎక్కు పెట్టి ఖడ్గమృగం ఎక్కడ కనిపిస్తుందా..!
అని వేచి చూస్తున్నాడు. ఆ సమయంలో శ్రవణకుమారుడు కూజాతో చెరువులో.. “బుడుగూ.. బుడుగూ” అనే శబ్దంతో నీళ్ళు ముంచుతున్నాడు. ఆ శబ్దాన్ని పొదకు అటువైపు నుండి విన్న దశరథుడు జంతువు నీళ్ళు త్రాగుతుందని భ్రమించి, “శబ్దవేధి” అనే బాణాన్ని ఆ కర్ణాంతము లాగి అతివేగంతో విజృంభించాడు.
ఆబాణం వాయువేగంతో వెళ్ళి శ్రవణకుమారుని గుండెల్లో గుచ్చుకుంది..! “హా పరమేశ్వరా..!” అంటూ శ్రవణుడు నేలకొరిగిపోతున్నాడు. పొదచాటున వున్న దశరధుడు ఆశ్చర్యంతో పరిగెత్తుకుంటూ అక్కడకి వచ్చాడు!
మరణించటానికి సిద్ధంగావున్న శ్రవణుని చూచి “నాయనా.. ఎవరు నీవు? ఇక్కడేం చేస్తున్నావు?” అన్నాడు శ్రవణుడు తనకథంతా చెప్పి నా తల్లితండ్రులు దాహంతో వున్నారు, ఈ నీళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళకు దాహం తీర్చండి అని చెప్పి దశరధుని చేతిలో మరణించాడు.
దశరధుడు ఆ నీళ్ళు తీసుకొని పద్మాక్ష విద్యావతి దంపతుల దగ్గరకొచ్చి ముందుగా పద్మాక్షునికి నీళ్ళు త్రాపించాడు. తదుపరి విద్యావతికి నీళ్ళు త్రాపించిన దశరధుణ్ణి తన కుమారుడే అని అనుకొని “నాయనా ఎంతదూరం పరిగెత్తావో.. ఇలారా! చమట తుడుస్తాను..!” అని తలను దగ్గరకు తీసుకున్నది వెంటనే దశరధుని కీరిటం, ఆభరణాలు చేతికి తగిలినవి, అప్పుడు విద్యావతి..! “నీవు మా కుమారుడవు కావే..? ఎవరు నీవు..? అని ప్రశ్నించింది! ఇక దశరధునికి నిజం చెప్పకతప్పలేదు..!
“అమ్మా నన్ను దశరధుడంటారు, నేను అయోధ్యరాజ్య చక్రవర్తిని
నీ కుమారుడని తెలియక ఏదోజంతువు నీళ్ళు త్రాగుతుందని భ్రమించి, బాణం వేశాను. నీ కుమారుడు చనిపోయాడమ్మా..! నన్ను క్షమించు..! అన్నాడు.
ఆ మాటలు విని పద్మాక్ష విద్యావతి దంపతులు ఎంతో దుఃఖించారు..!
పద్మాక్షుడు విద్యావతితో అన్నాడు
“ఓ భార్యామణి! మన వృద్ధాప్యంలో.. మన కుమారుడే మన దగ్గర లేనపుడు మనం మాత్రం జీవించి ఏమి సార్ధకం, కనుక మనం కూడా మన సహస్రారం నుండి ఇచ్చామరణంతో ప్రాణం విడిచి, మనమూ, మన కుమారుని దగ్గరకే వెళ్ళిపోదాం!” అని అనుకొని వారు చనిపోయే ముందుగా దశరధుణ్ణి శపిస్తున్నారు…!
“ఓయీ… దుష్ఠా.. దశరథా..! మా కుమారుడే మా దగ్గర వృద్ధాప్యంలో లేనపుడు మేము చనిపోతున్నాం కనుక, నీవు కూడా నీ వృద్ధాప్యంలో నీ కుమారులు నీ దగ్గర లేనపుడే నీవూ చనిపోవుదువు గాక..!” అనిశపించి మరణించారు !
కానీ ఆ గ్రుడ్డి దంపతులకు తెలియని విషయం ఏమిటంటే, అప్పటి వరకూ దశరథునికి అసలు సంతానమే లేదనే విషయం ఈ వృద్ధ దంపతులకు తెలియదు. అప్పటి వరకు, దశరధునికి సంతానంలేక ఎన్నో పూజలు చేశాడు, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అయినా సంతానం కలగలేదు..!
కానీ ఈ పుణ్యదంపతుల శాపం కారణంగా.. ఇది ఒక ‘వరం’గా పరిణమించింది. అసలు సంతానమేలేని దశరధునికి ఒకరు కాదు ఇద్దరు కాదు, రామ-లక్ష్మణ – భరత – శతృఘ్నులు అనే నలుగురు కుమారులు జన్మించారు!

మన ఆర్యవైశ్యుడైన శ్రవణకుమారుని మరణమే రామ జననానికి కారణమైంది.
వైశ్యుడైన శ్రవణకుమారుడే లేకపోతే.. రాముడూ.. లేడూ, రామాయణమూ లేదు..!
శ్రీరాముడు పితృవాక్యధర్మాన్ని ఆచరించాడు!
ఆంజనేయస్వామి మాతృవాక్యధర్మాన్ని పాలించాడు!
కానీ వీరికంటే ముందే వైశ్యుడైన శ్రవణకుమారుడు అంధులైన తల్లితండ్రులను సేవించాడు, కీర్తివంతుడైనాడు!
శ్రవణకుమారుని మాతాపితృభక్తినే శ్రీరాముడు, ఆంజనేయస్వామి ఆదర్శంగా తీసుకుని ఆచరించి గొప్పవారైనారు, పూజించబడ్డారు!
మహాత్మాగాంధీగారికి కూడా భగవద్గీత తరువాత ఆయనకు ఇష్టమైనకథ శ్రవణకుమారునికథ!
గాంధీగారు శ్రవణకుమారుణ్ణి ఆదర్శంగా తీసుకుని, తల్లితండ్రులను సేవించి గాంధీ’ మహత్ముడైనాడు!
ఈ శ్రవణకుమారుని వంశంలో జన్మించినవాడే మన కుసుమశ్రేష్ఠి. ఆయన కూతురే మన శ్రీకన్యకాపరమేశ్వరీదేవి,

Sravana Kumar's granddaughter, Srivasavidevi:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *