పాక్‌కు ‘శివరాత్రి’.. భారత్‌కు ‘విజయరాత్రి’! కొలంబోలో నాడు సచిన్.. నేడు ఇషాన్ ‘తాండవం’

కొలంబో: మైదానంలో దాయాదుల పోరు అంటేనే హై ఓల్టేజ్.. అలాంటిది పవిత్రమైన మహా శివరాత్రి రోజున భారత్-పాక్ తలపడితే ఆ మజానే వేరు! కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ పోరులో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకుంది. 61 పరుగుల భారీ తేడాతో పాక్‌ను చిత్తు చేసి, సగర్వంగా సూపర్-8లోకి అడుగుపెట్టింది.

అప్పుడు సచిన్.. ఇప్పుడు ఇషాన్: చరిత్ర పునరావృతం!
ఈ మ్యాచ్‌లో ఒక అద్భుతమైన సెంటిమెంట్ పండింది. 2003లో సరిగ్గా శివరాత్రి రోజే సచిన్ టెండూల్కర్ 98 పరుగులతో పాకిస్థాన్‌ను ఊచకోత కోశారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే శివరాత్రి రోజున ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77 పరుగులు) పాక్ బౌలర్లను వణికించాడు. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో ఇషాన్ ఆడిన ‘షాన్‌దార్’ ఇన్నింగ్స్ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.

మిస్టరీ స్పిన్ తుస్సుమంది.. సూర్య ప్రతాపం మిగిలింది!
మ్యాచ్‌కు ముందు పాక్ ‘మిస్టరీ’ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ గురించి చాలా చర్చ నడిచింది. కానీ మన బ్యాటర్ల ముందు ఆ మిస్టరీ ఏమీ సాగలేదు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (32) తొలి బంతికే బౌండరీతో స్వాగతం పలికి తారిక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. దీంతో పాక్ నమ్ముకున్న ప్రధాన అస్త్రం కాస్తా తుస్సుమంది.

బౌలర్ల భీభత్సం.. 114 పరుగులకే పాక్ ప్యాకప్!
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్‌ను పెవిలియన్ పంపడమే లక్ష్యంగా బుమ్రా, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లతో విరుచుకుపడ్డారు. తిలక్ వర్మ, కుల్దీప్ చెరో వికెట్ తీసి పాక్ పతనాన్ని శాసించారు. దీంతో పాక్ 114 పరుగులకే కుప్పకూలి పరువు పోగొట్టుకుంది.

పాక్ పరువు ‘కాళరాత్రి’..
టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాక్‌పై భారత్‌కు ఇది 8వ విజయం. మ్యాచ్ ఆడబోమంటూ నాటకాలాడిన పాకిస్థాన్‌కు, మైదానంలోకి దిగాక టీమిండియా అసలైన సినిమా చూపించింది. భారత అభిమానులకు ఇది పండగ లాంటి శివరాత్రి అయితే.. పాకిస్థాన్‌కు మాత్రం కోలుకోలేని ‘కాళరాత్రి’గా మిగిలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top