ఈ క్షేత్రం ఎక్కడుంది?- ఆ ప్రదేశం స్థల పురాణం – ఆ ఆలయం విశిష్ట రూపం-ఏడు పడగల నాగేంద్రుడి విశిష్ఠత
Pampanuru Sri Subrahmanya Swamy Temple: ఓంకారానికి అర్థాన్ని చెప్పి తన తండ్రి శివయ్యకు గురువుగా మారినా, సేనాధిపతుల్లో స్కందుడిని నేనంటూ సాక్షాత్తూ కృష్ణపరమాత్మునిచే ప్రశంసలు పొందినా అవన్నీ సుబ్రహ్మణ్యస్వామి విశిష్టతలను చాటిచెప్పేవే! దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు. అతి ప్రాచీనమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కూడా ఎక్కువగా దక్షిణ భారతంలోనే కనిపిస్తాయి. మహిమాన్వితమైన ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడం వలన మానసిక శారీరక రుగ్మతలు తొలగుతాయని విశ్వాసం. అలాంటి ఓ అరుదైన సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం
సుబ్రహ్మణ్యుడు తన తల్లిదండ్రులతో సోదరుడితో కలిసి వెలసిన క్షేత్రం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ స్వామి ఏక శిలపై, ఏక పడగతో, సప్త శిరస్సాసన శ్రీ చక్ర సహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వెలసి ఉన్నాడు.
క్షేత్రం ఎక్కడుంది?
ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది. ధన ధాన్యాలనూ, జ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ అందించే వరప్రదాతగా అక్కడ స్వామి ప్రసిద్ధి చెందాడు. సుమారు అయిదు వందల సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీ వ్యాసరాయలు సర్ప స్వరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి, దేవాలయాన్ని నిర్మించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
స్థల పురాణం
పూర్వం యోగులు, మహర్షులు తపస్సును ఆచరించిన ఈ తపోవనంలో సప్త అంటే ఏడు కోనేర్లు ఉండేవట. ప్రస్తుతం వీటిలో ఆరు కోనేర్లు శిథిలం కాగా, దేవాలయం తూర్పు దిక్కున ఒక కోనేరు మాత్రమే మిగిలి ఉంది. కాలక్రమంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. తర్వాతి కాలంలో గ్రామస్థులు, ఇతర దాతలు అందించిన విరాళాలతో ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు.
విశిష్ట రూపం
పంపనూరు క్షేత్రంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏడు శిరస్సులతో దర్శనమిస్తాడు. ఇక్కడి మూలవిరాట్టును ఒకే శిలతో ఐదు రూపాలు స్ఫురించేలా మలచి ఉండడం విశేషం. ఏ సుబ్రహ్మణ్య క్షేత్రంలోనూ లేని విధంగా విగ్రహం పీఠం నుంచి శిరస్సు వరకు ఒక్కో రూపం ఒక్కో దేవతను సూచిస్తుంది. పీఠం భాగంలో శ్రీచక్రం పార్వతీదేవికి, ఆపై భాగంలో చుట్టలు చుట్టేసినట్లుగా కనిపించే సర్పం నాగేంద్రుడికీ, సర్పరూపంలోని చివరి భాగం వక్రతుండుడి ఆకారంలో గణపతికీ ప్రతీకలుగా నిలుస్తున్నాయి. అలాగే మూలవిరాట్టు మధ్యభాగం శివలింగంగా దర్శనమిస్తుంది.
ఏడు పడగల నాగేంద్రుడు
సర్పాకారంలో ఉన్న విగ్రహం ఏడు తలల పడగవిప్పిన నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు. ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరునిగా పూజలందుకుంటోంది. మూలవిరాట్టుకు ఇరువైపులా నెమలి పింఛాలతో కూడిన చక్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుని మూల విగ్రహం ఐదు శక్తి రూపాలతో వెలసి ఉండటం, శివుడు పార్వతి, గణపతి, షణ్ముఖుడు, నాగేంద్రుడు ఇలా శివుడి పరివారమంతా ఒకే చోట, ఒకే విగ్రహంలో దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో మంజునాథ, పార్వతి దేవి విగ్రహాలు దర్శనమిస్తాయి.
శ్రావణం ప్రత్యేకం
ఈ క్షేత్రంలో ప్రతి శ్రావణ, కార్తిక, మాఘ మాసాల్లో విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రధానంగా శ్రావణ మాసంలో శత సర్ప క్షీరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుని కల్యాణం, అష్టోత్తర కలశాభిషేకం, మూలవిరాట్టుకు అఖండ అన్నాభిషేకాన్ని జరిపిస్తారు. కార్తిక మాసం మూడో ఆదివారం ఉసిరి చెట్టు, తులసి మాత, బృందావనానికి తులసి దామోదర కల్యాణోత్సవం జరిపిస్తారు. అదే రోజు ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి మాఘ మాసం రెండో ఆదివారం నాడు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది.

కైలాస ద్వార ప్రవేశం
మహా శివరాత్రి రోజున ఆలయానికి ఉత్తరాన ఉన్న కైలాస ద్వార ప్రవేశం కల్పిస్తారు. ఇవే కాకుండా ప్రధాన పండుగలు ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా, నాగుల చవితి, షష్ఠి రోజుల్లో ప్రత్యేక అభిషేకాలు, విశిష్ట అలంకరణ, విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి నెలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన శుద్ధ షష్ఠి తిథిలో అభిషేకం, సహస్రనామార్చన, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు.
పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని దర్శిస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, కల్యాణం కాని వారికి కల్యాణ యోగం కలుగుతుందని విశ్వాసం. అలాగే సంతానం కోరుకునే వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుందని నమ్మకం.
ఎలా చేరుకోవాలి
అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్నాయి. శ్రావణ, కార్తిక, మాఘ మాసాలు, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది.
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

