చిత్రం: శంబాల
రేటింగ్: 2.5/5
తారాగణం: ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్, శ్వాసిక విజయ్, మధునందన్, రవి వర్మ, మీసాల లక్ష్మన్, హర్ష వర్ధన్, ఇంద్రనీల్. శైలజ ప్రియ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కెమెరా: ప్రవీణ్
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
నిర్మాతలు: మహీధర్ రెడ్డి, రాజశేఖర్
దర్శకత్వం: యుగంధర్ ముని
విడుదల: 24 డిసెంబర్ 2025
అసలు ఆది సాయికుమార్ సినిమా చూసి ఎన్నాళ్లయ్యిందో రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్లు కూడా చెప్పడం కష్టం. అవకాశాలొస్తున్నాయి, చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ, జనం దృష్టిని ఆకర్షించిన చిత్రాలైతే తన నుంచి రాలేదు. చాలానాళ్లకి ఈ “శంబాల” వచ్చింది. ట్రైలర్ ఆకట్టుకుంది. టైటిల్ ని బట్టి ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అయిన సనాతన హైందవానికి సంబంధించిన చిత్రమని అర్ధమవుతూనే ఉంది. ఇంతకీ విషయమెలా ఉందో చూద్దాం.
1980లో శంబాల అనే మారుమూల పల్లెటూరిలో ఒక ఉల్క పడుతుంది. అది పడిన క్షణం నుంచి ఊరిలో అరిష్టాలు జరిగుతుంటాయి. కొందరు వింతగా ప్రవర్తించడం మొదలుపెడతారు. ఊళ్లో ఒక ఆవు పొదుగుని పిండితే పాలకి బదులు రక్తం వస్తుంది. ఆ ఆవుని సజీవసమాధి చేస్తే తప్ప ఫలితం రాదని ఆ ఊరి స్వామీజీ చెప్తాడు. ఇంతకీ ఆ ఉల్క శకలం ఎర్రగా మెరుస్తూ పొగలు చిమ్ముతూ ఉంటుంది. దానిని టెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ శాస్త్రజ్ఞుడు విక్రం (ఆది) అక్కడికి చేరతాడు. అతను ప్రతీదీ సైంటిఫిక్ గా మాట్లాడుతూ, ఊరి జనాన్ని ఎదిరించి, ఆ ఆవుని చంపకుండా అడ్డుకుంటాడు. అక్కడి నుంచి ఊరిలో అరిష్టాలు పెరిగిపోతాయి. ప్రజలు చచ్చిపోతుంటారు. ఆ ఉల్కకి, ఈ చావులకి సంబంధమేంటో తెలీక సైన్స్ ని నమ్ముకున్న విక్రం కూడా అయోమయం చెందుతుంటాడు. ఆ ఊరి పూజారి కూతురు దేవి (అర్చనా అయ్యర్) అతనికి బాసటగా నిలుస్తుంది. ఆ తర్వాత ఏమౌతుంది? ఈ కథలో సైన్స్ ఎంత, స్పిరిచ్యువాలిటీ ఎంత అనేది తెర మీద చూడాలి.
ఎక్కడో ఉన్న పురాణ కథని తీసుకుని, దానికి హారర్ ఎలిమెంట్ జోడించి, డివైన్ ఎలిమెంటుతో నడిపిన కథ ఈ శంబాల. హీరో ఉన్నాడు కాబట్టి డ్యూయెట్స్ పాడే హీరోయిన్ ఉండాలి అనే ఫార్ములా పెట్టుకోకుండా కథనాన్ని నడిపిన వైనం బాగుంది.
అయితే ఉల్కని పరీక్షించడానికి ఒకే ఒక్క సైంటిష్టు లింగులిటుకుమంటూ రావడం, ఫైటింగులు గట్రా చేసేయడం లాంటివి అంతగా అతకని సినిమాటిక్ లిబెర్టీస్. అవలా ఉంచితే దేవి పాత్ర అంతలా మేకప్ వేసుకుని తిరుగుతుంటే ఆడియన్స్ కి “చివరకి ఈ కేరెక్టర్ రివీల్ అలా అవుతుందేమో” అనే అనుమానం కలుగుతుంది. కచ్చితంగా అలానే అయ్యింది. చాలా సినిమాలు చూసిన అనుభవమున్న ఆడియన్స్ కి ఆ మాత్రం ఊహించడం కష్టం కాదు. విపులంగా చెబితే స్పాయిలర్ అవుతుంది కనుక ఇంత వరకు మాత్రమే చెప్పడం జరుగుతోంది.
ఆద్యంతం సినిమా ఒకటే లొకేషన్లో, ఒకే పాయింట్ మీద నడుస్తుంది. అయినా పెద్దగా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ గా నడిపే ప్రయత్నం చేసాడు దర్శకుడు.
ప్రతి మనిషిలోనూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఎంతో కొంత ఉంటాయి. కొందరికి ఎక్కువుంటాయి. అలాంటి వాళ్లని పట్టుకుని ప్రాణాలు తీసే మహమ్మారి కథని చెప్పడం బాగుంది. “మనం గెలవాల్సింది మనల్ని.. భూతాన్ని కాదు” అనే లైన్ కానీ, చివర్లో గుడిలో గంటలు కొట్టడం వెనుకనున్న విషయం కానీ చెప్పిన విధానం బాగుంది.
నటీనటుల విషయానికొస్తే ప్రధమార్ధంలో రాములు పాత్రలో రవి వర్మ ట్రాక్ పెద్దదే ఉంది. పాత్రోచితంగా ఎంగేజింగ్ గా నటించాడు.
ఆది పాత్రకి తగిన మెథడ్ యాక్టింగ్ లాంటిది ఏదైనా ప్రయత్నించి ఉంటే బాగుండేది. తనలో మాస్ హీరో ఉన్నాడని జనానికి గుర్తు చేయడానికన్నట్టుగా మూస యాక్షన్ సీన్లు పెట్టుకున్నాడు. నాస్తికుడినుంచి ఆస్తికుడిగా మారే సన్నివేశంలో తన నుంచి ఇంకా బలమైన పర్ఫామెన్స్ ఆశించడం తప్పు కాదు.
దేవి పాత్రలో అర్చనా అయ్యర్ నిండుగా ఉంది.
మిగిలిన వారిలో బాలనటి బాగా నటించింది.
మీసాల లక్ష్మన్, శ్వాసిక విజయ్, మధునందం లకి మంచి పాత్రలు పడ్డాయి. ఇంద్రనీల్ కూడా ఓకే. తక్కిన పాత్రధారులంతా వారి పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నికల్ గా నేపథ్య సంగీతం బాగుంది. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా హారర్ ఫీల్ ని పెంచాయి. నిర్మాణవిలువలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇంత ఏ.ఐ రోజుల్లో కూడా మైథాలజీ సీన్స్ ని ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. అనుభూతిపరంగా విజువల్ ఇంకా పైస్థాయిలో ఉండాల్సింది.
చివరిగా చెప్పేదేంటంటే.. శాస్త్రీయత, మూఢనమ్మకం అనే విషయాలు పక్కన పెడితే హాల్లో కూర్చున్న కాసేపూ ఒక పాయింట్ పట్టుకుని ఎంగేజ్ చేయగలిగింది ఈ చిత్రం. అలాగని అద్భుతంగా ఉందా అంటే కాదు. కొన్ని సీన్స్ ఫోర్స్డ్ గా ఉన్నాయి, కొన్ని పేలవంగా ఉన్నాయి. దైవశక్తిని, క్షుద్రశక్తిని, మనుషుల్లోని గుణాలని పెనవేస్తూ తీసిన ఒక సూపర్నేచురల్ కథాంశం ఇది.
ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి తగినట్టుగా వచ్చిన ఈ చిత్రం ఈ జానర్ ని ఇష్టపడే ఆడియన్స్ ని కూర్చోబెట్టొచ్చు. ప్రధమార్ధం, ఇంటర్వల్ బ్యాంగ్, ద్వితీయార్ధం అన్నీ పర్వాలేదనిపించినా క్లైమాక్స్ ఎందుకో తేలిపోయినట్టు అనిపించింది. మొత్తమ్మీద పెద్దగా ట్విస్టులు, సర్ప్రైజులు లేవు. అవి ఉండుంటే ఇంకా బాగుండేది. సినిమా పూర్తైపోయింది అనుకుంటే మళ్లీ సీక్వెల్ కి స్కోప్ వదులుతూ ఎండ్ చేసిన పద్ధతి రొటీన్ రొట్టకొట్టుడులా అనిపించింది. దీనివరకు ఓకే కానీ, సీక్వెల్ కోసం వేచి చూసేంత స్థాయిలో అయితే లేదు.
