సెక్స్ బాబా ఆగడాలు …

లైంగిక వేధింపుల ఆరోపణలతో నిందితుడైన బాబా చైతన్యానంద సరస్వతి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పోలీసులు అతడి ఆశ్రమం, నివాస గదులను తనిఖీ చేయగా.. శృంగార బొమ్మ, ఐదు అశ్లీల సీడీలు, అశ్లీల ఫోటోలు లభ్యమయ్యాయి. అంతేకాకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్, ప్రధాని మోడీతో దిగినట్లు నకిలీ ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు తెర లేపింది.
అసభ్యకర చాటింగ్.. దర్యాప్తు అధికారులు విశ్లేషించిన ఫోన్ డేటాలో చైతన్యానంద అనేక అసభ్య చాట్స్ చేసినట్లు బయటపడింది. ఒక విద్యార్థినితో మాట్లాడుతూ, “ఒక దుబాయ్ షేక్‌కు శృంగార భాగస్వామి కావాలి, ఎవరైనా తెలుసా?” అని అడిగిన రికార్డులు బయటకు వచ్చాయి. అయితే దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారని స్పష్టంగా తెలియలేదు.
విద్యార్థులపై వేధింపులు.. ఢిల్లీలోని ఓ కళాశాల నిర్వాహక కమిటీ సభ్యుడిగా ఉన్న చైతన్యానంద, విద్యార్థినులను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. 17 మంది విద్యార్థినులను వేధించాడనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్థినుల ఫొటోలు తీయడం, అసభ్యంగా మెసేజ్‌లు పంపడం, సీసీ కెమెరా యాప్ ద్వారా వారి కదలికలను పర్యవేక్షించడం వంటి చర్యలు అతడి ఖాతాలో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఆగ్రాలో అరెస్టు.. కేసు నమోదు తర్వాత చైతన్యానంద రెండు నెలల పాటు బృందావన్, మధుర, ఆగ్రా ప్రాంతాల్లో దొంగచాటుగా తిరిగాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకు పలు వేషాలు వేసి పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరికి ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఆగ్రాలోని తాజ్‌గంజ్‌లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికి ఆయన ‘పార్థసారథి’ అనే పేరుతో ఒక హోటల్‌లో బస చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే చైతన్యానంద విచారణకు సహకరించడం లేదని, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారుల సమాచారం. అంతేకాకుండా అతడిలో పశ్చాత్తాపం ఏ మాత్రం కనిపించడం లేదని విచారణ అధికారులు వెల్లడించారు.

