సరస్వతి పవర్ షేర్ల వివాదం:జగన్‌కు నిరాశ..అప్పటి వరకు ఏ హక్కు లేదన్న కోర్టు..!!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మలకు సంబంధించి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ షేర్ల విషయంలో వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై జాతీయ స్థాయిలో అప్పీల్ కోర్టు అయిన ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్) చెన్నై బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్. శేషసాయి, టెక్నికల్ మెంబర్ జతీంద్రనాథ్ స్వైన్‌లతో కూడిన ధర్మాసనం, ఈ వివాదంపై పూర్తి స్థాయి విచారణ (ప్లీడింగ్స్) పూర్తయ్యే వరకు ‘స్టేటస్ కో’ (యథాతథ స్థితి) కొనసాగించాలని ఆదేశించింది.
తదుపరి విచారణ జరిగేవరకు వాటాదారుగా ఎవరూ ఎలాంటి హక్కు కలిగి ఉండరని లేదా వినియోగించుకోరాదని కోర్టు స్పష్టం చేసింది. జగన్ తరపు న్యాయవాది, విచారణ పూర్తయ్యే వరకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల అమలు విషయంలో కోర్టు ధిక్కారం కింద ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
NCLT తీర్పు ఏం చెప్పింది? తెలంగాణలోని ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) హైదరాబాద్ బెంచ్ 2025, జూలై 29న ఒక తీర్పు ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డిల వాటాలను వారి చెల్లెలు వైఎస్ షర్మిలకు “చట్టవిరుద్ధంగా” బదిలీ చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ సమర్థించింది. ముఖ్య కారణం: షేర్లను బహుమతిగా (గిఫ్ట్‌గా) ఇస్తానని చెప్పినప్పటికీ, ఆ బదిలీ పూర్తి కావడానికి అవసరమైన అసలు షేర్ సర్టిఫికెట్లను జగన్,భారతిరెడ్డిలు కంపెనీకి ఇవ్వలేదు.చట్ట ప్రకారం, ఈ పత్రాలు ఇవ్వకుండా షేర్లను బదిలీ చేయడం చెల్లదు అని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది. దీంతో వాటాదారులుగా జగన్, భారతి, విజయమ్మ పేర్లను తిరిగి నమోదు చేయాలని ఎన్‌సీఎల్‌టీ సూచించింది.
NCLATలో ఏం జరిగింది? ఎన్‌సీఎల్‌టీ తీర్పును సవాలు చేస్తూ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎన్‌సీఎల్‌ఏటీని (అప్పీల్ కోర్టు) ఆశ్రయించింది. ఈ అప్పీల్‌ను విచారించిన ఎన్‌సీఎల్‌ఏటీ… కేసు విచారణ పూర్తిగా ముగిసే వరకు (అంటే, ఇరుపక్షాల వాదనలు, పత్రాలు సమర్పించే ప్రక్రియ పూర్తయ్యే వరకు) “స్టేటస్ కో” (యథాతథ స్థితిని) పాటించాలని ఆదేశించింది. కుటుంబ సంబంధాలు, షేర్ల వివరాలు: మొదట్లో షేర్లను షర్మిలకు గిఫ్ట్‌గా ఇస్తానని వైయస్ జగన్ ఒప్పందం చేసుకున్నారు.అయితే, 2023లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి, 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు రాజకీయంగా వ్యతిరేకంగా నిలబడటంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఆ పాత ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే ఈ కంపెనీలో జగన్‌కు 29.88శాతం, భారతికి 16.30శాతం, విజయమ్మకు 48.99శాతం వాటాలు ఉన్నాయి. మిగతా వాటా క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కలిగి ఉంది.
