RTC Tour: రూ.660కే 3 పుణ్యక్షేత్రాలను చూసి రావొచ్చు.. ఆర్టీసీ బంపర్ ఆఫర్!

శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని, హనుమంతుని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఇది అమూల్య అవకాశం. హనుమంతుని దర్శనం హిందూ ధర్మంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆయనను భక్తులు శక్తి, ధైర్యం, భయం తొలగింపు, నిర్భయతకు మూర్తిమంతమైన ప్రతీకగా పూజిస్తారు. హనుమాన్ స్వామి దర్శనం వల్ల శారీరక, మానసిక శక్తి పెరిగి, కష్ట కాలంలో ధైర్యంగా ముందుకు సాగే మనోబలం లభిస్తుందని నమ్మకం.
శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామిని పూజించడం వలన విశేషమైన ప్రయోజనాలు ఉన్నాయని హిందూ ధర్మం చెబుతోంది. శ్రావణ మాసం శివ కేశవులకు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం అయినప్పటికీ, శివాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అయితే హనుమాన్ దర్శన్ కు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కల్పిస్తోంది శ్రీ సత్య సాయి జిల్లా ఏపీఎస్ఆర్టీసీ. డిపోల నుండి శ్రావణ మాసం పురస్కరించుకొని ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రాలైన మురిడి, నేమకల్లు, కసాపురం లకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి మధుసూదన్ తెలిపారు.
