RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్.. రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!

ఆర్టీసీ అదిరే ఆఫర్ తీసుకువచ్చింది. తక్కువ ధరతోనే ఆరు అమ్మవారి క్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.ఆషాడమాసం వస్తే చాలు గ్రామ దేవతల ఆలయాలు కళకళలాడుతూ కనిపిస్తాయి. ముఖ్యంగా ఆ జిల్లాలో వెలిసిన స్వయంభు దివ్యక్షేత్రాలు విశేష పర్వదినాల్లో లక్షలాది భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. విశేష పూజలు అలంకరణలతో ఆ జిల్లాలు ఈ ఆషాడమాసం వస్తే చాలు ఎటు చూసినా నిండు ఆధ్యాత్మికంతో వెల్లువిరుస్తాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఒక్కరోజులోనే ఆ ఉమ్మడి జిల్లాల్లో ఉన్న అన్ని ప్రధాన అమ్మవారి క్షేత్రాలు తిరిగి మరల స్వగ్రామాలకు వచ్చే విధంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ప్రారంభించినట్లుగా అధికారులు తెలియజేశారు. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడుంది ఆ అమ్మవారి ఆలయాలు ఏంటి ఆర్టీసీ ఆఫర్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అంటే ఆధ్యాత్మికానికి పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలో ఆషాడ మాస మహోత్సవాలు అత్యంత కమనీయంగా అమ్మవారి దివ్య సన్నిధిలో జరుగుతున్నాయి. వీటిలో ప్రధానంగా లోవ శ్రీ తలుపులమ్మ అమ్మవారు. కాండ్రకోట శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారు, పిఠాపురం పురుహుతికా అమ్మవారు, పెద్దాపురం మరిడమ్మ తల్లి అమ్మవారు, కాకినాడ మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారు, కొవ్వూరు వారాహిమాత అమ్మవారి క్షేత్రాలు ఎక్కువగా భక్తులు దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఈ దివ్య క్షేత్రాలు అన్ని ఒక్కరోజే దర్శనం చేసుకునే విధంగా అనంతరం మరల స్వగ్రామాలకు వచ్చే విధంగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నట్లు డిపో అధికారి రమణ తెలియజేశారు.ముఖ్యంగా రూరల్ ప్రాంతం నుంచి అన్నవరం దర్శనం అనంతరం ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రాలు అన్ని ఆర్టీసీ బస్సులో భక్తులకు దర్శనం చేయించి మరల మధ్యాహ్నం భోజనం పిఠాపురంలో ఏర్పాటు చేసి అనంతరం స్వగ్రామాలకు తీసుకొచ్చే విధంగా 450 రూపాయలకే అవకాశం ఆర్టీసీ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉంటే ఆ ప్రాంతం నుంచి బస్సు ప్రారంభం అవుతుందని. అలా కాకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అన్నవరం కత్తిపూడి తుని కాకినాడ రూరల్ తదితర ప్రాంతాల నుంచి ప్రతి మంగళవారం, గురువారంతో పాటు విశేషమైన రోజుల్లో ఈ ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ప్రధాన అధికారి రమణ తెలియజేశారు.

