Psych Siddhartha: మూవీ రివ్యూ: సైక్ సిద్ధార్థ

చిత్రం: సైక్ సిద్ధార్థ
రేటింగ్: 1.5/5
తారాగణం: శ్రీ నందు, యామిని భాస్కర్, ప్రియాంక రెబెక్క, సింహ, సుకేష్ రెడ్డి
సంగీతం: స్మరణ్ సాయి
కెమెరా: ప్రకాష్ రెడ్డి
ఎడిటర్: ప్రతీక్ నూతి
నిర్మాత: శ్రీనందు, రాణా దగ్గుబాటి
దర్శకత్వం: వరుణ్ రెడ్డి
విడుదల: 1 జనవరి 2026

డిసెంబర్ 12 న విడుదల కావాల్సిన ఈ చిత్రం ప్రచారంతో కాస్త దృష్టిని ఆకర్షించింది. మొదటిగా విదుదలైన పాట ఆసక్తిని రేకెత్తించింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణ కావడంతో ఇంకాస్త అంచనాల్ని ఏర్పరిచింది. వేదికల మీద హీరో మరియు నిర్మాత అయిన నందు ఎమోషనల్ స్పీచులు చూస్తే నిజంగా చాలా ఇష్టపడి, కష్టపడి చెక్కిన చిత్రం ఇది అని అనిపించింది. దాదాపు మూడు వారాలు వాయిదా పడి నేడు న్యూ ఇయర్ స్పెషల్ గా విడుదలయ్యింది. ఇంతకీ విషయమేంటో చూద్దా.

సిద్ధార్థ్ (నందు) దెబ్బ తిన్న యువకుడు. నమ్ముకున్న ప్రేమికురాలు మోసం చేసింది. నమ్మించి వ్యాపారంలో పెట్టుబడి పెట్టించుకుని ఒకడు నిలువునా ముంచేసాడు. సిద్ధార్థ పాయింట్ ఆఫ్ వ్యూవ్ లో వాళ్ళిద్దరూ సైకోలు. దాంతో అప్పులతో బతుకుతూ ఒక బస్తీ ప్రాంతంలోని లో-క్లాస్ గదిలో అట్టపెట్టెల మధ్యన దుర్భరంగా బతుకుతూ ఉంటాడు. చూసే వాళ్లకి ఇతనొక సైకోలా ఉంటాడు. ఇతనికున్న ఏకైక ట్యాలెంట్ బొమ్మలేయడం.

ఇక శ్రావ్య అనే ఒక పెళ్లయ్యి స్కూలుకెళ్లే కొడుకున్న ఇల్లాలు. భర్త సైకో. నిత్యం భార్యని చిత్రహింసలు పెట్టే సెక్స్ మేనియక్. అతనినుంచి తప్పించుకుని కొడుకుతో సహా ఇదే బస్తీలో సిద్ధార్థ్ ఉన్న అపార్ట్మెంటులోనే కింద పోర్షన్లో దిగుతుంది. ఇంతకీ ఆమె డ్యాన్స్ టీచర్. సైకోలవల్ల దెబ్బతిన్న సిద్, శ్రావ్య ఒకటవుతారా లేదా అనేది కథ.

నిజానికి ఈ కథని పద్ధతిగా, మనసుకి హత్తుకునేలా తీయొచ్చు. కానీ అలా తీయకూడదని నిర్ణయించున్నారు. సినిమా మొదలైన పది నిమిషాలకే కథనం మాడిన వాసన వస్తుంది. తేడా కొడుతోందని తెలుస్తూనే ఉంటుంది. అయినా ఏదో చిన్న ఆశ. ఎంతో కొంత విషయం లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్ భుజానికెత్తుకోదు కదా అని ఓపిక తెచ్చుకుని చూసే పరిస్థితి.

బూతు డైలాగులు, నగ్నంగా రోడ్ల మీద పరుగులు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పేర్లు చెప్పుకుంటూ సెక్స్ చేసుకోవడాలు, సింబాలిక్ హస్తప్రయోగ దృశ్యాలు పెట్టేస్తే యూత్ ఆడియన్స్ చొంగ కార్చుకుంటూ చూసేస్తారని తీసినవాళ్ల ఆలోచన అయితే అయ్యుండొచ్చు! కానీ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా ఈ అంశాలనే నమ్ముకోవడం దుస్థితికి పరాకాష్ట.

ఇందులో “చీప్ హూమర్ అన్లిమిటెడ్” అని మన్సూర్ అనే కేరక్టర్ సిద్ధార్థ్ పాత్రతో అంటాడు. నిజానికి సినిమా మొత్తం అదే.

అసలు భర్త వలన ఇబ్బందులు పడుతున్న ఒక స్త్రీ అలాంటి బస్తీలో, చుట్టూ కామాంధుల్లా కనపడే మగాళ్ల మధ్య ఎలా బతుకుతుంది? పైగా అర్ధనగ్నంగా సైకోలా తిరిగే వాడుండే ఇంటి కింద ధైర్యంగా ఎలా ఉండగలుగుతుంది? అలాంటి వాడిని నమ్మేసి కొడుకుని ఎలా అప్పజెబుతుంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు లాజిక్ తో అవసరంలేదు కనీ, కనీసం ఎమోషనల్ గా ఆడియన్స్ మనసుని తాకాలి కదా. దానికి ఏదో ఒక చిన్న కారణం చూపితే సరిపోదు. ఆర్గానిక్ గా హత్తుకునేలా డ్రామా నడపాలి. ఆ పని మీద దృష్టిపెట్టకుండా అనవసర జంక్ మీద కేంద్రీకృతం చేసి పాడుచేసుకున్నాడు దర్శక రచయిత.

నటీనటవర్గానికొస్తే నందు నటన చూస్తుంటే ఆద్యంతం సిద్ధు జొన్నలగడ్డని అనుకరిస్తున్నట్టు కనిపించాడు. నిజానికి నందు మంచి నటుడే. కానీ ఎందుకో గతంలో జెడీ చక్రవర్తిని అనుకరిస్తున్నట్టు, ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డని అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ లొడ లొడ లొడ డైలాగులు అరుస్తూనే ఉంటాడు. అది అతని ఐడెంటిటీ అయ్యింది. ఇక్కడ నందు కూడా అదే బాటపట్టడం, చాలాసార్లు మాడ్యులేషన్ కూడా అలాగే ఉండడం తన ఒరిజినాలిటీని దూరంగా నెడుతుంది.

శ్రావ్య పాత్రలో కనిపించిన యామిని భాస్కర్ కంటికింపుగా ఉంది. గృహిణి పాత్రకి సరిగ్గా సరిపోయింది. ఉన్నంతలో తెర మీద చూడదగ్గవిధంగా కనిపించిన నటి ఈమె ఒక్కరే.

త్రిష పాత్రలో కనిపించిన ప్రియాంకా రెబెకా, మన్సూర్ గా కనిపించిన సుకేష్ రెడ్డి హీరోపాలిటి విలన్స్ అని సమాచారం టైపులో ఉంటుంది తప్ప వాళ్ల మీద ఆడియన్స్ కి స్ట్రాంగ్ నెగటివ్ ఫీలింగ్ కలిగే విధంగా సీన్స్ కన్సీవ్ చేయలేదు.

హీరో ఫ్రెండ్ సింహ పాత్రచేత కామెడీ చేయించానని దర్శకుడు అనుకుంటే అనుకుని ఉండొచ్చు కానీ, హాల్లో ఎక్కడా నవ్వులు వినపడలేదు.

టెక్నికల్ గా పాటలు బాగున్నాయి. లిరిక్స్ కొత్తగా ఉన్నాయి. వినడానికి ఇంపుగా, అర్ధవంతంగా, ఈ జెనెరేషన్ కి నప్పే విధంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉండి 2 గంటల్లో పూర్తిచేసింది సినిమాని. నిర్మాణ విలువలు మాత్రం చాలా దయనీయంగా ఉన్నాయి. అసలు నటులే కాదేమో అనిపించే కొందరి చేత కూడా నటింపజేసి చీప్ లుక్ తీసుకొచ్చారు.

చివరిగా చెప్పాలంటే..ఈ చిత్రంలో టైటిల్ పాత్ర ఒక్కటే కాదు ..అందరూ సైకిక్ సమస్య ఉన్నవాళ్లలానే ఉంటారు. సినిమా అంతా ఒక ఎత్తైతే, చివర్లో ఒక వ్యక్తి తెరమీదకొచ్చి “ఎంట్రా ఇంకా కూర్చున్నారు. ఇక్కడితో అయిపోతే మీకు నచ్చదా? మీకు హ్యాపీ ఎండింగే కావాలా? అయితే చూడండి..దీనిని 100 కోట్ల సినిమా చేయపోతే బాగోదు” లాంటి స్టేట్మెంట్ ఏదో ఇచ్చి లాస్ట్ షాట్ చూపిస్తాడు. ఇది మేకర్స్ దృష్టిలో లైటర్ వేన్ ఎండింగ్ అనిపించి ఉండొచ్చు. కానీ ఇది అప్పటివరకు భరించిన ప్రేక్షకులని కెలికినట్టు ఉంది. ఇంతోటి సినిమాకి రావడమే ఎక్కువ మళ్లీ 100కోట్లా..అని నవ్వొస్తుంది, చిరాకొస్తుంది, జాలి కూడా వేస్తుంది.

బాటం లైన్: ప్రేక్షక వ్యధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top