రోజాను బూతులు తిడితే పవన్ కల్యాణ్ మెచ్చుకున్నారు – బండారు సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు లేకుండా ఏ చర్చ జరగడం లేదు. అయితే, ఇటీవల ఒక వివాదాస్పద అంశంలో పవన్ కళ్యాణ్ పేరు అనూహ్యంగా తెరపైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ అంశం పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పార్టీని కూడా ఇరకాటంలో పడేసేలా ఉంది.
వైసీపీ హయాంలో అప్పటి మంత్రి, సినీనటి రోజాపై విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసి అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపారు. అసభ్యకరమైన పదజాలంతో రోజా క్యారెక్టర్‌ను కించపరిచేలా మాట్లాడినందుకు ఆ టీడీపీ నేతను జగన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే, ఆయన వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు.
ఇటీవలే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బండారు సత్యనారాయణ, ఆ పాత వివాదాన్ని మళ్లీ గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రోజా ఎపిసోడ్లో తాను అరెస్టు అయిన తర్వాత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు మద్దతుగా నిలిచారని చెప్పడం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేసింది. అంతేకాకుండా, నేను ఒక హోటల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, అన్ని విధాల అండగా ఉంటామని నాకు హామీ ఇచ్చారంటూ బండారు సత్యనారాయణ తెలియజేశారు. మహిళల పట్ల అసభ్యకర పదజాలం ఉపయోగించిన నేతకు పవన్ కళ్యాణ్ అండగా నిలబడటంపై అటు మహిళా సంఘాల నుంచి, ఇటు వైసీపీ శ్రేణుల నుంచి పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.రాజకీయ వైరం ఎలా ఉన్నా, మహిళల విషయంలో అసభ్య పదజాలంతో మాట్లాడిన వారికి పవన్ కళ్యాణ్ ఓదార్పు ఇవ్వడం ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
గతంలో తన తల్లిని దూషించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత బాధపడ్డారో అందరికీ తెలిసిందే… మరి ఇప్పుడు వైసీపీ నేత రోజా విషయంలో ఆ నిబద్ధత ఏమైంది? అంటూ ఆయనను నిలదీస్తున్నారు. మొత్తానికి, ఈ సున్నితమైన, వివాదాస్పద అంశంలోకి పవన్ కళ్యాణ్ పేరును బండారు సత్యనారాయణ లాగడం జనసేన కార్యకర్తలలోనూ అసహనం కలిగిస్తోంది. ఈ వ్యాఖ్యలు కూటమికి, ముఖ్యంగా జనసేనకు ఎలాంటి ఇబ్బందులు తీసుకొస్తాయో చూడాలి.

