PAN Aadhaar: పాన్ కార్డు కొత్తగా తీసుకునేవారికి అలర్ట్.. ఇక తప్పనిసరి.. జులై 1 నుంచే కొత్త రూల్స్

PAN Card: పాన్ కార్డుకు సంబంధించిన కొత్త రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఇక కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ ఉంటేనే పాన్ కార్డ్ జారీ చేయనున్నారు. అలాగే ఇప్పటికే పాన్ కార్డు కలిగి ఉన్న వారు ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అది ఎలా లింక్ చేయాలి? పాన్ ఆధార్ కొత్త రూల్స్ గురించి తెలుసుకుందాం.
హైలైట్:
- కొత్తగా పాన్ కార్డు తీసుకునే వారికి అలర్ట్
- ఇకపై ఆధార్ ఉంటేనా పాన్ జారీ
- జులై 1 నుంచే కొత్త రూల్స్
PAN Card: మీరు కొత్తగా పాన్ కార్డ్ (శాశ్వత ఖాతా సంఖ్య) తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకో అలర్ట్. మీరు కొత్త పాన్ కార్డు పొందాలంటే మీకు ఆధార్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు దరఖాస్తు, జారీలో కొత్త మార్పులు చేసింది. సీబీటీడీ తీసుకొచ్చిన కొత్త నిబంధన జులై 1, 2025 నుంచే అమలులోకి వచ్చింది. ఇకపై ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రంతో పాటుగా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ లేని వారికి పాన్ కార్డ్ జారీ చేయరను గుర్తుంచుకోవాలి.
ఇప్పటి వరకు కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ధ్రువీకరణ డాక్యుమెంట్ (డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, పదో తరగతి మెమో వంటివి) సమర్పిస్తే సరిపోయోది. ఇక నుంచి తప్పనిరిగా ఆధార్ నంబర్ ఉండాల్సిందే. ఇప్పటికే పాన్ కార్డు ఉన్న వారు సైతం కచ్చితంగా పాన్- ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ పాన్ కార్డు రద్దవుతుంది. అలా రద్దయిన పాన్ కార్డుతో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేందుకు ప్రయత్నించినట్లయితే పెద్ద మొత్తంలో పెనాల్టీలు కట్టాల్సి రావచ్చు.
ఆధార్ పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది?
ప్రస్తుతం పాన్ కార్డు కలిగి ఉన్న వారు కచ్చితంగా ఆధార్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. వారికి డిసెంబర్ 31, 2025 వరకు గడువు ఉంటుంది. ఆలోపు ఆధార్- పాన్ కార్డ్ లింక్ చేస్తే ఎలాంటి పెనాల్టీలు ఉండవు. ఆ తర్వతా ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులన్నీ రద్దవుతాయి. ఒక్కరి వద్దే ఒకటికి మించి పాన్ కార్డులు ఉండడం, ఇతరుల పాన్ కార్డు ఉపయోగించి లావాదేవీలు చేస్తూ పన్నులు ఎగ్గొట్టడం వంటివి గుర్తించి క్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఈ మేరకు ఆధార్- పాన్ లింక్ తప్పనిసరి చేసింది. మార్చి 2024 నాటికి 74 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. అందులో 60.5 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో లింక్ అయి ఉన్నాయి.
ఆధార్- పాన్ లింక్ ప్రాసెస్..
- ఆధార్- పాన్ లింక్ చేసుకునేందుకు ముందుగా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలోని క్విక్ లింక్స్ సెక్షన్లో కనిపించే లింక్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
- మీ పాన్ కార్డ్ 10 అంకెల నంబర్, ఆధార్ కార్డ్ 12 అంకెల నంబర్ ఎంటర్ చేయాలి.
- ఆధార్‌లో ఉన్న విధంగా మీ పేరు ఎంటర్ చేయాలి.
- ఆధార్ వివరాలు వాలిడేట్ చేసేందుకు అనుమతిస్తూ బాక్స్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత క్లిక్ వాలిడేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీరు డిసెంబర్ 31, 2025 తర్వాత లింక్ చేస్తే ఒక పాపప్ వస్తుంది. పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనేది కనిపిస్తుంది. అంటే మీరు రూ.1000 పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని అర్థం.
- ఇ-పే ట్యాక్స్ ద్వారా పేమెంట్ చేసేందుకు కంటిన్యూ పై క్లిక్ చేయాలి.
- మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి. మీ మొబైల్ నంబర్ ఇస్తే ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత ఇ-పే ట్యాక్స్ పేజీలోకి వెళ్తుంది. అప్పుడు మీరు యాక్సెస్ ఇటర్ 2025-26, అదర్ రిసిప్ట్స్ (500), పాన్- ఆధార్ లింక్ జాప్యం కోసం ఫీ చెల్లింపులపై క్లిక్ చేయాలి.
- రూ.1000 వివరాలు కనిపిస్తాయి. కంటిన్యూ పై క్లిక్ చేయాలి. మీ పేమెంట్ మెథడ్ ఎంచుకోవాలి.
- పేమెంట్ పూర్తి చేస్తే ఛాలన్ అనేది జనరేట్ అవుతుంది.
- ఇ-ఫైలింగ్ పోర్టల్ లో లింక్ ఆధార్ సెక్షన్ లోకి తిరిగి రావాల.
- మీ పాన్, ఆధార్ నంబర్, పేరు ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీతో వెరిఫై చేయాలి.

