Pahalgam Attack Pakistan Link Evidence: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో కచ్చితంగా పాకిస్థాన్ ప్రమేయముందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రపంచ దేశాల ముందుంచింది.
13 దేశాల అధినేతలకు ప్రధాని ఫోన్
బైసరన్ వ్యాలీలో దాడికి తెగబడిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ తో ప్రత్యక్ష సంబంధముందని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. వారి సరిహద్దు చొరబాటుకు సంబంధించిన నిఘా రికార్డులు, పాకిస్థాన్‌లోని రెండు ప్రదేశాలతో ముడిపడి ఉన్న ఎలక్ట్రానిక్ సంతకాలను నిఘా వర్గాలు గుర్తించాయి. వీటిని ఉదహరిస్తూ ప్రపంచ వేదికపై పాకిస్థాన్‌ను ఒంటరిని చేయడమే లక్ష్యంగా భారతదేశం పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, డచ్ ప్రధాన మంత్రి డిక్ స్కూఫ్ సహా 13 దేశాధినేతలతో ఫోన్లో సంభాషించారు. ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడదామని పిలునిచ్చారు. ఈ క్రూరమైన ఉగ్రవాద దాడిపై, అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఇటలీ, జోర్డాన్, నేపాల్ , ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, మారిషస్, జోర్డాన్, జపాన్, డచ్ తదితర దేశాల నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సంఘీభావం ప్రకటించారు.
పర్యాటకుల భద్రతపై హామీ..
ఇప్పటికే ఇస్లామాబాద్‌తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సింధు జలాల ఒప్పందం రద్దుతో సరిహద్దుల వద్ద రెచ్చిపోతున్న పాక్ సైన్యానికి ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా బదులిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీయులు ఇండియాలో పర్యటించేందుకు ఆందోళన చెందుతున్నారు. దీంతో భారతదేశం ఇప్పటికీ, ఎప్పటికీ సందర్శకులకు సురక్షితమేనని ప్రపంచ దేశాలకు న్యూఢిల్లీ హామీ ఇచ్చింది. విదేశీ పర్యాటకులు భద్రత విషయమై ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.
