అప్పుడు బిల్ క్లింటన్, ఇప్పుడు జేడీ వాన్స్.. అమెరికా కీలక నేతల భారత పర్యటనల సమయంలో కశ్మీర్‌లో ఇలాంటి దాడులెందుకు?
పహల్గాంలో పర్యటకులపై దాడి
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటనలో ఉన్న సమయంలోనే జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై దాడి జరిగింది.
దౌత్యపరంగా అత్యంత కీలక సమయంలో ఈ దాడి జరిగింది.
అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ రావడానికి ఒక్కరోజు ముందు 2000 సంవత్సరం మార్చి 20న అనంత్‌నాగ్‌లోని చిత్తీసింగ్‌పొరాలో 36 మంది సిక్కులను ‘పాకిస్తాన్ బేస్డ్ మిలిటెంట్లు’గా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఊచకోత కోశారు.
ఈ దాడి గురించి భారత పర్యటనలో ఉన్న క్లింటన్‌తో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయీ నేరుగా చర్చించారు. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయముందని వాజపేయీ క్లింటన్‌తో ప్రస్తావించారు.
ఆ తర్వాత రెండేళ్లకు 2002 మే 14న అప్పటి అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టినా రోకా పర్యటన సందర్భంలో కూడా కాలూచక్‌లో మరోసారి మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు.
ఆ ఘటనలో.. పౌరులు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు సాయుధులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆర్మీ ఫ్యామిలీ క్వార్టర్లపై దాడి చేశారు. ఈ దాడిలో 23 మంది మరణించగా వారిలో 10 మంది చిన్నారులు. 34 మంది గాయపడ్డారు.
ఈ దాడులన్నీ అమెరికాకు చెందిన కీలక నేతలు భారత్‌లో పర్యటిస్తున్నప్పుడే జరిగాయి.