గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేశ్!

Nara Lokesh: ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై మంత్రి నారా లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిన తరహాలోనే.. ప్రస్తుత గూగుల్ పెట్టుబడులతో విశాఖపట్నం కూడా అదే స్థాయిలో రూపాంతరం చెందబోతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వం విధానాలు, భవిష్యత్తు ప్రణాళికలు, కీలక హామీల గురించి నారా లోకేశ్ వివరించారు.
గూగుల్ భారీ పెట్టుబడి.. లక్ష ఉద్యోగాల లక్ష్యం విశాఖపట్నంలో గూగుల్ భారీ పెట్టుబడి రాష్ట్రానికి ఓ మైలురాయిగా లోకేశ్ అభివర్ణించారు. గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని విశాఖలో పెట్టడానికి ముందుకు వచ్చిందని.. ఇందులో డేటా సెంటర్ ఏర్పాటు అత్యంత పెద్ద విజయమని ప్రకటించారు. ఈ పెట్టుబడితో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేవలం డేటా సెంటరే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించిన అనేక అనుబంధ కంపెనీలు కూడా విశాఖకు వస్తున్నాయని తెలిపారు.
ఈ పెట్టుబడిని సాధించడానికి సెప్టెంబర్ 2024లో తాను గూగుల్ ప్రతినిధులతో సమావేశమై స్థలాన్ని చూపించడం, ఆ తర్వాత యూఎస్‌కు వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలవడం వంటి కీలక ప్రయత్నాలు చేశామని లోకేశ్ వివరించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు భేటీ కావడం వల్లే ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైందని ఆయన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయాన్ని కొనియాడారు. అభివృద్ధి వికేంద్రీకరణీ లక్ష్యం నారా లోకేశ్ ‘అభివృద్ధి వికేంద్రీకరణే’ తమ లక్ష్యంగా ప్రకటించారు. ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’ నినాదంతో అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆకర్షిస్తున్న పరిశ్రమలు/రంగాలు ప్రాంతాల వారీగా.. విశాఖ/ఉత్తరాంధ్ర -గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ఐటీ సంస్థలు. అనంతపురం, కర్నూలు- పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లు, సిమెంట్ ఫ్యాక్టరీలు. చిత్తూరు, కడప -ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ (శ్రీసిటీ విస్తరణ). శ్రీసిటీ (చిత్తూరు)- డైకెన్, బ్లూస్టార్, ఎల్జీ వంటి కంపెనీల పెట్టుబడులు. ప్రకాశం -రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడులు. అమరావతి -క్వాంటమ్ కంప్యూటింగ్. ఉభయ గోదావరి జిల్లాలు- ఆక్వా రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించడం.
‘డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్’ వేగం ఏపీలో పరిశ్రమల స్థాపన, పాలన వేగాన్ని వివరిస్తూ లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ప్రథమ స్థానంలో ఉందని, కేవలం అవగాహనా ఒప్పందాలప సంతకాలు చేయడం కాకుండా, వాటిని ఆచరణలో చేసి చూపిస్తున్నామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. తాము ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని, ముఖ్యంగా ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఛాలెంజ్‌గా తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.”అన్ని రాష్ట్రాల్లో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం ‘డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ ఉంది. ఢిల్లీలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం చంద్రబాబు కలిసి పనిచేయడం వల్లే ఇంత వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైంది,” అని ఆయన కితాబిచ్చారు. మరిన్ని శుభవార్తలు.. వైకాపాపై విమర్శలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే చరిత్ర సృష్టించడం లేదా తిరగరాయడం సాధ్యమని లోకేశ్ అన్నారు. గతంలో కియా ఏర్పాటుతో చరిత్ర సృష్టించామని, ఇప్పుడు గూగుల్‌తో విశాఖలో ఆ చరిత్రను తిరగరాయబోతున్నామని ప్రకటించారు.త్వరలో అంటే నవంబర్ నెలలో మరిన్ని భారీ పెట్టుబడులు, శుభవార్తలు ఉంటాయని లోకేశ్ హింట్ ఇచ్చారు. ముఖ్యంగా నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు యూనిట్‌కు 13 పైసలు తగ్గేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. గత ఐదేళ్ల పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందని, ‘వైకాపా పేటీఎం బ్యాచ్’ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. డేటా సెంటర్ అంటే ఏమిటో గతంలో పనిచేసిన మంత్రికి తెలుసా అని ఆయన ప్రశ్నించారు

