సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ..!

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ – సీఎం రేవంత్ రెడ్డి వివాదం సర్దుమనిగింది. మంత్రి కొండా సురేఖ స్వయంగా మీడియా ముందుకు వచ్చి సీఎంకి క్షమాపణలు చెబుతూ వివాదానికి తెరదించారు. తమ ఇంటికి పోలీసులు రావడంతో సుస్మిత ఆవేశంతో కొన్ని వ్యాఖ్యలు చేసిందని.. ఆమె తరపున తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని త్వరలోనే అన్నీ సవ్యంగా సర్దుకుంటాయని స్పష్టం చేశారు. దీంతో సీఎం రేవంత్ వర్గీయులు సైతం కూల్ అయినట్టు భావిస్తున్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి పోలీసులు చేరుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆమెకు ఓఎస్‌డీగా పనిచేసిన సుమంత్ అనే అధికారి అవినీతి ఆరోపణలతో అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా పోలీసులు ఇంటికి రావడంతో.. సురేఖ కుమార్తె కొండా సుస్మిత వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలానికి దారితీసింది.
సుష్మిత మాట్లాడుతూ.. మా ఇంటికి రోహిణ్ రెడ్డి గన్ తో వచ్చారని.. అది ఇచ్చింది సీఎం రేవంత్ అంటూ వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా బీసీ మహిళా మంత్రిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌లో వర్గపోరు మళ్లీ తలెత్తిందని చర్చ మొదలైంది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో కాంగ్రెస్ హైకమాండ్ సైతం జోక్యం చేసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నేరుగా సురేఖను సంప్రదించి పరిస్థితి చల్లార్చే ప్రయత్నం చేశారు. దీపావళి రోజున మంత్రి సురేఖ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలసి వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇద్దరూ స్పష్టతకు వచ్చారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే హైకమాండ్ సూచనల మేరకు సురేఖ స్వయంగా మీడియా ముందు క్షమాపణ చెప్పడం ద్వారా విషయం ముగిసిందని అనుకుంటున్నారు. సురేఖ క్షమాపణతో ఇప్పుడు అంతా సర్దుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఇప్పటి వరకు స్పందించకపోవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఓ వర్గం పార్టీ ఇమేజ్ కాపాడే వ్యూహంగా పరిగణిస్తే.. మరో వర్గం మరోలా చెప్పుకొస్తున్నారు. కానీ మొత్తానికి ఇష్యూ సమసిపోవడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ విభేదం నిజంగానే ముగిసిందా లేక మరో మలుపు తిరుగుతుందా అనేది స్పష్టం కానుంది.

