అమృత్ భారత్ ప్రయాణికుల ప్రాణాన్ని దేవుడే కాపాడాలి- దీన్ని చూస్తే ముద్ద కూడా దిగదు..!!

ప్రయాణికులు వాడి పడేసిన డిస్పోజబుల్ ఫుడ్ కంటైనర్లను కడిగి మళ్లీ వాటినే రీ యూజ్ చేసిన ఉదంతం ఇది. తమిళనాడులోని ఈరోడ్-బీహారర్ లోని జోగ్బాణీ మధ్య రాకపోకలు సాగించే నంబర్ 16601 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన రైళ్లలో పరిశుభ్రత, ఫుడ్ క్వాలిటీపై అనేక ప్రశ్నలు, సందేహాలను లేవనెత్తింది.
ఈ పేపర్ కంటైనర్లను కడుగుతున్న ఆ వ్యక్తి.. ఐఆర్సీసీటీసీకి చెందిన క్యాటరింగ్ ఉద్యోగిగా చెబుతున్నారు. ప్రయాణికులు తిని పడేసిన పేపర్ కంటైనర్లను వాష్ బేసిన్ వద్ద కడుగుతోండటం, అంతకుముందు కడిగిన వాటిని ఓ పక్కగా పెట్టి ఉండటం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. కంటైనర్లను కడుగుతున్నప్పుడు అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు.. దీన్ని తన మొబైల్ లో చిత్రీకరించాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వాష్ బేసిన్ ట్యాప్ నుంచి వచ్చీ రాని నీటితోనే అడ్డదిడ్డంగా కడిగి వాటినే రీయూజ్ కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది.
వీడియో రికార్డ్ చేస్తున్న ప్రయాణికుడు ఈ విషయం గురించి ప్రశ్నించగా.. ఆ ఉద్యోగి కంగారు పడ్డాడు. కంటైనర్లను కడిగి వెనక్కి పంపించాలని తనపై ఉద్యోగులు చెప్పడం వల్లే ఈ పని చేస్తున్నట్లు చెప్పాడు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కు ప్రత్యేకంగా ప్యాంట్రీ కార్ ఉన్నప్పటికీ అక్కడ కాకుండా ప్రయాణికులు ఉండే కోచ్ లో ఎందుకు కడుగుతున్నావని అడగ్గా.. దానికి స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోయాడు. ప్యాంట్రీ కార్ లో కడిగితే అక్కడి వారికి తెలిసిపోతుందని కారణం కావొచ్చని ఆ ప్రయాణికుడు చెప్పాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. డిబేట్స్ కు దారితీసింది. నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియోను IRCTC కి ట్యాగ్ చేస్తోన్నారు. ఫలితంగా IRCTC ట్రెండింగ్ అవుతోంది. ఈ సంఘటనపై విచారణ జరపాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేశారు. దీన్ని కోట్ల రూపాయల స్కాంగా అభివర్ణించారు కొందరు యూజర్లు. రైల్వే అధికారులు కుమ్మక్కై ప్రజలకు మురికి, పురుగులు పట్టిన ఆహారాన్ని, వాడిన డిస్పోజబుల్ కంటైనర్లల్లో వడ్డిస్తున్నారని మండిపడ్డారు.
