Malaria Fever: మలేరియా రావొద్దంటే.. మీ ఇంట్లో, చుట్టుపక్కల ఇవి లేకుండా చూసుకోండి!

ప్రస్తుతం వర్షాలు విరుచుకుపడుతున్న వేళ వాతావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడంతో వైరస్లు, బ్యాక్టీరియా వేగంగా వ్యాపించే అవకాశముంటుంది. దీని వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా పుడతాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ మార్పుల కారణంగా అనేక సమస్యలు చుట్టుముడతాయి. వర్షాకాలం రోగాలకు నిలయమని వైద్యులు అంటుంటారు. వర్షాకాలంలోనే సీజనల్ వ్యాధులు ఎక్కువగా పలకరిస్తాయి. తేమ, చల్లటి వాతావరణం బ్యాక్టీరియా, వైరస్ లకు అనుకూలం. అవి బలంగా విస్తరించడానికి వాతావరణం అనుకూలిస్తుంది. ఈ సమయంలో వ్యాధులు సంక్రమించనుండడంతో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
వర్షాకాలంలో సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో అనేక మంది మలేరియా వ్యాధి బారిన పడుతుంటారు. మలేరియా అనేది దోమల ద్వారా సంక్రమించే ప్రాణాంతక వ్యాధి. మలేరియా అనేది పరాన్నజీవి సంక్రమణం. ఇది ప్లాస్మోడియం పరాన్నజీవి ద్వారా వస్తుందని హనుమకొండ నగరంలోని శ్రీనివాస హాస్పిటల్ కు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ విశ్వభరత్ రెడ్డి తెలిపారు. ఇందులో నాలుగు రకాలుగా ఉంటాయి. అందులో ప్రధానంగా వ్యాపించేది ప్లాస్మోడియం ఫాల్సిఫరం, ప్లాస్మోడియం వైవాక్స్. ఈ రెండు ముఖ్యమైనవి.
ఇది దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతాయి. మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా సంక్రమించే పరాన్నజీవి ద్వారా వస్తుంది. ఈ దోమ సోకిన వ్యక్తిని కుట్టినప్పుడు పరాన్నజీవులు దోమలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దోమ మరో వ్యక్తిని కుట్టినప్పుడు పరాన్నజీవులు ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి మలేరియా వ్యాధిని కలిగిస్తాయి. వర్షాకాలంలో ఈ దోమలు ఎక్కువ ప్రబలడం ద్వారా మలేరియా అనేది ఒకరి నుండి మరొకరికి సోకుతుంది.

