Madhuri Divvala: మరోసారి వివాదంలో దివ్వెల మాధురీ.. నోటీసులు పంపిన టీటీడీ!

Madhuri Divvala: తిరుమలకు వెళ్లిన ఎవరైనా దేవుణ్ని ఎప్పుడు చూడాలి, మొక్కులు ఎలా చెల్లించుకోవాలి.. ఇలా ఆలోచిస్తారు. కానీ.. ఆ జంట మాత్రం ఎక్కడ సెల్ఫీలు తీసుకోవాలి, ఎక్కడ ఫొటోషూట్ చేయించుకోవాలి అని ఆలోచిస్తారని.. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరి టీటీడీ ఎందుకు నోటీసులు పంపిందో ఈపాటికే మీకు స్ట్రైక్ అయి ఉంటుంది.
తిరుమల పుణ్యక్షేత్రం దగ్గర చేయకూడని పనులు చేసి, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొండపై రీల్స్ చెయ్యడం తాజా వివాదానికి కారణమైంది. ఈ బుధవారం ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. దర్శనం తర్వాత, వారు బస చేసిన విభవ అతిథిగృహం వద్ద దివ్వెల మాధురి రీల్స్ చేశారు. కొండపై ఇదేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలను గాయపరిచారని ఆరోపించారు. ఈ ఘటన తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసిందని భక్తులు విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ విభాగం దివ్వెల మాధురికి నోటీసులు పంపింది.
గతంలో కూడా దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలోని ఆలయ పరిసరాల్లో రీల్స్ చేసిన వివాదాస్పదమైన సంఘటనలు జరిగాయి. 2024 అక్టోబర్లో, తిరుమాడ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ సృష్టిస్తూ రీల్స్ చేసినందుకు వారిపై టీటీడీ అధికారులకు ఆగ్రహం వచ్చింది. వారు తిరుమల పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో.. కేసు నమోదైంది. అప్పట్లో బీఎన్ఎస్ సెక్షన్లు 292, 296, 300, సెక్షన్ 66-200-2008 కింద కేసు రాశారు.
తిరుమల పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మికత, భక్తి భావం మినహా ఇతర వాణిజ్య లేదా వ్యక్తిగత కార్యకలాపాలకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది. దివ్వెల మాధురి రీల్స్ చిత్రీకరణ ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ జంటపై తొలిసారి కేసు రాసినప్పుడే కఠిన చర్యలు తీసుకొని ఉంటే, ఇప్పుడు ఇలా చేసేవారు కాదని ప్రజలు, భక్తులు మండిపడుతున్నారు. పోలీసులు వారి పట్ల ఉదాసీనంగా ఉంటున్నారని అంటున్నారు.

