మాత్రశ్రీ తరిగొండ వెంగమాంబ

తరిగొండ వెంగమాంబ 18 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి, తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తురాలు. వేంకటాచల మాహాత్మ్యము, ద్విపద భాగవతం వంటి ఆధ్యాత్మిక కావ్యాలు రచించింది.
జీవిత విశేషాలు
వెంగమాంబ చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలంలోని తరిగొండ గ్రామంలో వాసిష్ఠ గోత్రీకుడైన కానాల మంగమాంబా,కృష్ణయా మాత్య అను నందవరీక దంపతులకు 1730లో జన్మించింది. వెంగమాంబ బాల్యంలో తన తోటి పిల్లల్లాగా ఆటలాడుకోక ఏకాంతంగా కూర్చొని భక్తి పారవశ్యంలో మునిగి తేలేది. ఆ చిరు ప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురంగా గానం చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యంను సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంగమాంబకు బోధించాడు. అనతి కాలంలోనే వెంగమాంబ ప్రశస్తి నలుమూలల పాకడంతో తండ్రి ఆమె విద్యాభ్యాసాన్ని మాన్పించి తగిన వరుని కోసం వెతకడం ప్రారంభించాడు.
ఇంటి పనులలో సహాయం చేయమని తల్లి చెప్పినపుడు తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ తిరస్కరించింది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందంగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపాలతో పెళ్లి చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప వెంగమాంబను చూసి ముగ్ధుడై ప్రేమలో పడి ఆమెను వివాహమాడుటకు అంగీకరించాడు. తండ్రి వివాహం జరిపించాడు. వివాహానంతరం వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించే ప్రయత్నం చేసాడు, కానీ వెంగమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదు.
ఈమె తిరుమలలో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తుంది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనిపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో, ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉంది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం సా.శ. 1890లో ఈస్ట్ ఇండియా కంపెనీవారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తుంది. ఈమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించింది. చివరకు సా.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందింది.

News by : V.L
Tarigonda Vengamamba