విశాఖకు ఎంతో ఆదాయాన్ని తెచ్చి పెట్టే కొత్తవలస-కిరండూల్ లైన్ కేకే లైన్ ఉత్తరాంధ్ర నుంచి జారి పోయింది. దానిని తీసుకెళ్లి రాయగడ డివిజన్ లో కలిపెస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒడిశా ప్రయోజనాలకు పట్టం కడుతూ తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని అంటున్నారు.
కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే ఆదాయ మార్గాలు పూర్తిగా మూసుకుపోయినట్లే అని అంటున్నారు. ఆదాయం వచ్చే ప్రాంతాలను రాయగడ డివిజన్ లో కలిపేస్తున్నారని ఆవేదన ఉత్తరాంధ్రాలో కనిపిస్తోంది. విశాఖ రైల్వే డివిజన్ అభివృద్ధికి స్వయం సమృద్ధికి ఈ చర్య వల్ల పెను విఘాతం కలుగుతుందని అంటున్నారు.
కేకే లైన్ లేని విశాఖ డివిజన్ ఎందుకు అని అంతా ప్రశ్నిస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చింది అని సంతోషించాలో లాభాలను తెచ్చే కేకే లైన్ పక్క రాష్ట్రానికి పోయిందని విచారించాలో అర్ధం కావడం లేదని అంటున్నారు. దీని మీద వైసీపీ నేతలు అయితే కస్సుమంటున్నారు.
ఉత్తరాంధ్రా అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోందని దానికి ఇదే నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీ నుంచి కేంద్రంలో ముగ్గురు మంత్రులు ఉన్నారని అలాగే ఎంతో మంది ఎంపీలు ఉన్నారని కానీ కేకే లైన్ తరలిపోకుండా ఎందుకు ఆపలేకపోయారు అని ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు జవాబు చెప్పాలని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేస్తారు. తిరిగి కేకే లైన్ ని విశాఖ డివిజన్ లో కలిపేలా వైసీపీ భారీ ఉద్యమాన్ని నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.
కేకే రైల్వే లైన్ కూడా ఒక సెంటిమెంట్ గా మారిన నేపధ్యంలో ఈ ఉద్యమం ఏ తీరున సాగుతుందో చూడాల్సి ఉంది అంటున్నారు.
