కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ? వాట్సాప్ ఛాట్ లీక్..!

ఏపీలో కల్తీ మద్యం కేసు సంచలనంగా మారింది. అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో తొలుత బయటపడిన ఈ కేసులో తవ్వే కొద్దీ షాకింగ్ వాస్తవాలు బయటపడుతున్నాయని సీఎం చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు బలం చేకూర్చే పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల విచారణలో ఈ కేసు అన్నమయ్య జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాలకు విస్తరించినట్లు ఇప్పటికే తేలింది. అలాగే ఇందులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాత్ర ఉందని తెలుస్తోంది.
తాజాగా కల్తీ మద్యం కేసులో అరెస్టు చేసిన నిందితుడు జనార్ధన్ రావు తాను జోగి రమేశ్ చెప్పినట్లే చేశానని, చివరికి తానే పట్టించాడంటూ సంచలన ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేసాడు. పోలీసు కస్టడీలో ఉన్న అతను అదే డ్రెస్సులో కనిపిస్తున్న ఈ వీడియోలో ఎలా మాట్లాడాడు, దాన్ని ఎవరు లీక్ చేశారన్న దానిపై చర్చ జరుగుతుండగానే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేశ్ తో జనార్ధన్ వాట్సాప్ ఛాట్ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వాట్సాప్ ఛాట్ కల్తీ మద్యం కేసు నిందితుడు జనార్ధన్ ఫోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో జోగి రమేశ్ అన్న ఎమ్మెల్యేగా సేవ్ చేసుకున్న ఓ నంబర్ నుంచి ఆయనకు మెసేజ్ లు రావడం, దానికి ఆయన సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో జోగి రమేశ్ సదరు జనార్ధన్ ను తన ఇంటికి రావాలని మెసేజ్ పెట్టగా.. ఆ తర్వాత ఆయన రెండు వాయిస్ కాల్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత జోగి రమేశ్ రెండు వాయిస్ కాల్స్ చేశారు. అయితే ఈ నాలుగు కాల్స్ ను ఎదుటి వారు ఆన్సర్ చేయలేదు.
ఆ తర్వాత నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావని జోగి రమేశ్ ప్రశ్నించారు. ఆ తర్వాత కాల్ మీ, ఫేక్ టైం అంటూ మరో రెండు మెసేజ్ లు పెట్టారు. దీంతో జనార్ధన్ ఓకే అన్నా అని సమాధానం ఇచ్చాడు. దీంతో ఈ ఛాట్ ముగిసింది. దీనిపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. నకిలీ మద్యం కేసులో ముందు నుండీ టీడీపీ చెబుతున్నదే నిజమని తేలిందని చెబుతోంది. ఈ మొత్తం వ్యవహారానికీ సూత్రధారి జోగి రమేషే అంటూ.. A1 జనార్దన్ రావుతో జోగి రమేష్ చేసిన వాట్సాప్ చాట్ మెసేజెస్ బయటకు రావడంతో వైసీపీ తేలు కుట్టిన పిల్లి చందంగా ఈ వ్యవహారాన్ని దారి మళ్లించే పనిలో పడిందని ఆరోపిస్తోంది.
