Jaggery vs Sugar: పంచదార వద్దు.. బెల్లం ముద్దు.. ఈ 7 కారణాలు తెలిస్తే, ఇక చక్కెరకు RIP చెబుతారు!

Jaggery vs Sugar: పంచదార మంచిది కాదనీ, బెల్లం మంచిదని మీకు చాలా మంది చెప్పే ఉంటారు. కానీ.. ఎందుకు అనే ప్రశ్న అలాగే ఉంటుంది. పంచదార తింటే సమస్యేంటి? ఎందుకు ఆహార పదార్థాల్లో, టీలలో చక్కెరను వాడొద్దంటున్నారు? ఆ ఆసక్తికర విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం, పంచదార రెండూ చెరకు నుంచే తయారవుతాయి. కానీ వాటి తయారీ ప్రక్రియ, ఆరోగ్యంపై వాటి ప్రభావాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. బెల్లం సహజమైన రూపంలో ఉండి, శరీరానికి అనేక పోషకాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పంచదారను శుద్ధి చేస్తారు కాబట్టి.. అది కేలరీలను పెంచుతుందే తప్ప దాని వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మనం బెల్లం, పంచదార మధ్య ఆరోగ్య ప్రయోజనాలు, పంచదార వాడకం వల్ల కలిగే సమస్యల్ని వివరంగా తెలుసుకుందాం. బెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు:
బెల్లం చెరకు రసం నుంచి సహజ పద్ధతిలో తయారవుతుంది. ఇందులో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బెల్లం శరీరంలోని విష పదార్థాల్ని తొలగిస్తుంది. ఈ బెల్లంలో కూడా నల్ల బెల్లం మరింత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పంచదారతో సమస్యలు:
మన తాతలు, ముత్తాతలూ.. పంచదార కాకుండా.. బెల్లమే వాడేవాళ్లు. మన జనరేషన్స్ వచ్చేసరికి పంచదార వచ్చేసింది. దీన్ని వాడటం తేలిక, చూడటానికి తెల్లగా, అందంగా ఉంటుంది. స్టాక్ పెట్టుకోవడం తేలిక, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అందువల్ల మనం దీన్ని వాడేస్తూ ఉంటాం. కానీ ఇది ఒక వేస్ట్ పదార్థం. జస్ట్ ప్రాసెస్ చేసిన తీపి పదార్థం మాత్రమే. ఇది ఎలాంటి పోషకాలనూ అందించదు. ఇది కేలరీలను మాత్రమే అందిస్తుంది. శరీర బరువు పెరగడానికి పంచదార ప్రధాన కారణంగా మారుతోందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పంచదార వల్ల కలిగే 7 అనారోగ్య సమస్యలు:
ఊబకాయం: పంచదారలో ఉండే కేలరీలు శరీర బరువును వేగంగా పెంచుతాయి.
డయాబెటిస్: పంచదారను ఎక్కువగా వాడితే, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి, టైప్-2 డయాబెటిస్ రాగలదు.
గుండె జబ్బులు: పంచదార ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను పెంచి, గుండె జబ్బులు వచ్చేందుకు కారణమవుతుంది.
కాలేయ సమస్యలు: పంచదారను అదికంగా వాడితే కాలేయంలో కొవ్వు పేరుకుపోగలదు. ఫ్యాటీ లివర్ సమస్య రాగలదు.
దంత సమస్యలు: నోట్లో దంతాలు కుళ్లిపోవడానికి, చిగుళ్లు దెబ్బతినడానికీ పంచదార కారణమవుతోంది.
మానసిక ఒత్తిడి: పంచదార అధికంగా తీసుకునేవారి మానసిక ఒత్తిడీ, ఆందోళనా పెరుగుతాయి.
వృద్ధాప్యం: పంచదార వల్ల త్వరగా ముసలితనం వచ్చేస్తుంది. ఇది చర్మంలో కొలాజెన్ను దెబ్బతీసి, ముడతలు వచ్చేలా చేస్తుంది.
బెల్లం ఎందుకు మంచిది?
బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి సహజమైన శక్తి లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విష వ్యర్థాలను తగ్గిస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని బెల్లం తగ్గిస్తుంది. అయితే, బెల్లం కూడా మితంగా తీసుకోవాలని, అతిగా ఏది వాడినా సమస్యేనని నిపుణులు సూచిస్తున్నారు. పంచదార వాడకాన్ని ఎలా తగ్గించాలి?:
పంచదార వాడకాన్ని తగ్గించడానికి, ఆహారంలో బెల్లం, తేనె వంటి సహజ తీపి పదార్థాలను ఉపయోగించవచ్చు. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో పంచదార ఉండొచ్చు. బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు, కుకీలు, ఐస్క్రీమ్లు, కూల్డ్రింక్స్ ఇలా చాలా వాటిలో పంచదార ఉండొచ్చు. వాటిని కొనే ముందు లేబుల్స్ని జాగ్రత్తగా చదవాలి. పంచదారను వాడితే, వాటిని దూరం పెట్టడం మేలు. ఇంట్లోనే బెల్లంతో చిరుతిళ్లు తయారుచేసుకోవడం, వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది.నిపుణుల సలహా:
బెల్లాన్ని మితంగా వాడమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది కూడా చెరకు నుంచే వస్తోంది. ఇందులో కూడా చక్కెర ఉంటుంది. కాకపోతే అది సహజంగా ఉండటం వల్ల అందులో పోషకాలు కూడా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. పంచదారను పూర్తిగా మానేయడం, తక్కువగా వాడటం వంటివి చేస్తే, దీర్ఘకాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.మొత్తంగా బెల్లం, పంచదార రెండూ చెరకు నుంచే వస్తాయి. కానీ బెల్లం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. పంచదార వాడకం వల్ల ఊబకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, సహజమైన బెల్లాన్ని మితంగా వాడుతూ, పంచదారను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందవచ్చు. కాబట్టి ఈసారి షాపుకి వెళ్లినప్పుడు.. మీ లిస్టులో పంచదారను కొట్టేసి, బెల్లం రాస్తే సరిపోతుంది. (Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత ఆరోగ్య నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి.)

