మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్తాన్ బోల్తా పడింది. ఎప్పటిలాగానే ఒత్తిడి తలొగ్గి పరాజయం పాలైంది. చివరి వరకు పోరాడి ఓడిపోవడం రాజస్తాన్‌కు వరుసగా ఇది మూడోసారి. ఇక, ఎట్టకేలకు స్వంత మైదానం అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరిసింది
మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్తాన్ బోల్తా పడింది. ఎప్పటిలాగానే ఒత్తిడి తలొగ్గి పరాజయం పాలైంది. చివరి వరకు పోరాడి ఓడిపోవడం రాజస్తాన్‌కు వరుసగా ఇది మూడోసారి. ఇక, ఎట్టకేలకు స్వంత మైదానం అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరిసింది. ఈ సీజన్లో స్వంత మైదానంలో ఆర్సీబీకి ఇదే తొలి విజయం. కింగ్ కోహ్లీ (70) మరోసారి చెలరేగడంతో పాటు దేవ్‌దత్ పడిక్కళ్ (50) హాఫ్ సెంచరీ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో ఆర్సీబీ బ్యాటర్లు చెలరేగారు. కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ (26) కూడా వేగంగా ఆడి తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హసరంగా బౌలింగ్‌లో సాల్ట్ అవుట్ అయిన తర్వాత వచ్చిన పడిక్కళ్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ, పడిక్కళ్ రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో ఆర్చర్ బౌలింగ్‌లో కోహ్లీ అవుటైన తర్వాత టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్కు అద్భుత ఆరంభం లభించింది. యశస్వి జైస్వాల్ (49) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ సూర్యవంశీ (16) తో కలిసి తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత నితీష్ రాణా (28), రియాన్ పరాగ్ (22) నెమ్మదిగా ఆడారు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ (47) మ్యాచ్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఒత్తిడికి లోనై అవుట్ అయ్యాడు. 19వ ఓవర్ వేసిన ఆర్సీబీ బౌలర్ హాజెల్‌వుడ్ మ్యాచ్‌ను ఆర్ఆర్కు దూరం చేశాడు. దీంతో ఆర్ఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు మాత్రమే చేయగలిగింది.
