దేశంలోనే తొలి ఫ్యామిలీ SUV స్కూటర్ విడుదల!

కోమాకి(Komaki) కంపెనీ FAM 1.0, FAM 2.0 అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటిని దేశంలోనే మొట్టమొదటి ఎస్యూవీ స్కూటర్లుగా పేర్కొంటున్నారు. ఇవి కుటుంబ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండి, డబ్బును కూడా ఆదా చేసే విధంగా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ కోమాకి తమ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు FAM 1.0, FAM 2.0లను విడుదల చేసింది. దేశంలోనే ఇది మొదటి ఎస్యూవీ స్కూటర్ అని కంపెనీ ధైర్యంగా చెబుతోంది. ఈ స్కూటర్లను ముఖ్యంగా కుటుంబ ప్రయాణాల కోసం సౌకర్యవంతంగా ఉండేలా.. ఖర్చులను ఆదా చేసే విధంగా డిజైన్ చేశారు. 3 చక్రాలపై నడిచే ఈ స్కూటర్లను గృహావసరాలకు, వాణిజ్య అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. FAM 1.0 ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999 కాగా.. FAM 2.0 ఎక్స్-షోరూమ్ ధర రూ.1,26,999గా నిర్ణయించారు. ఈ స్కూటర్ల ప్రత్యేకతలు వివరంగా తెలుసుకుందాం.
శక్తివంతమైన LiPo4 బ్యాటరీ టెక్నాలజీ ఈ రెండు స్కూటర్లలో శక్తివంతమైన LiPo4 బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది వాటిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ బ్యాటరీలు 3,000 నుంచి 5,000 ఛార్జింగ్ సైకిల్స్ వరకు పనిచేస్తాయి. ఇది వాటి అసాధారణ మన్నికను సూచిస్తోంది. ఈ లిథియం బ్యాటరీ తేలికగా, కాంపాక్ట్‌గా ఉండడం వల్ల వేడెక్కడం, అగ్ని ప్రమాదం లేదా పేలుడు వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఈ బ్యాటరీలు వేగవంతమైన ఛార్జింగ్‌కు కూడా సహాయపడతాయి. తద్వారా ఛార్జింగ్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఈ బ్యాటరీలు పర్యావరణానికి కూడా అనుకూలమైనవి.
ప్రయాణాన్ని సులభతరం చేసే స్మార్ట్ ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేక ఆధునిక సాంకేతికతలతో వస్తున్నాయి.
సెల్ఫ్-డైగ్నోసిస్ సిస్టమ్: ఈ సిస్టమ్ స్కూటర్లోని ఏదైనా సమస్యను స్వయంగా గుర్తించి, రైడర్‌కు ముందే హెచ్చరికను అందిస్తుంది, తద్వారా ఇబ్బందులను నివారించవచ్చు. రివర్స్ అసిస్ట్: ఇరుకైన ప్రదేశాల నుండి సులభంగా బయటకు తీయడానికి రివర్స్ అసిస్ట్ ఫీచర్ సహాయపడుతుంది. ఆటో హోల్డ్ ఫీచర్: ప్రత్యేక బ్రేక్ లీవర్‌తో పాటు ఆటో హోల్డ్ ఫీచర్ ఉంది. ఇది మెరుగైన పట్టును, ఖచ్చితమైన బ్రేకింగ్‌ను అందిస్తుంది. స్మార్ట్ డ్యాష్‌బోర్డ్, రేంజ్, స్టోరేజ్ స్మార్ట్ డ్యాష్‌బోర్డ్: ఈ స్కూటర్లలో రియల్-టైమ్ రైడ్ డేటా, నావిగేషన్, కాల్ అలర్ట్‌ల వంటి సమాచారాన్ని చూపించే స్మార్ట్ డ్యాష్‌బోర్డ్ ఉంది. పవర్ అవుట్‌పుట్, వేగాన్ని సర్దుబాటు చేయడానికి ఇందులో వేర్వేరు గేర్ మోడ్స్ కూడా ఇవ్వబడ్డాయి. రేంజ్: FAM 1.0 మోడల్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. FAM 2.0 మోడల్ 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అధిక స్టోరేజ్ స్పేస్: FAM 1.0, FAM 2.0లు కుటుంబ ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడ్డాయి. ఇందులో సౌకర్యవంతమైన సీట్లతో పాటు 80-లీటర్ల పెద్ద బూట్ స్పేస్ (డిక్కీ), చిన్నపాటి వస్తువులు ఉంచుకోవడానికి ముందు భాగంలో ఓ బాస్కెట్ కూడా ఉన్నాయి. మెటాలిక్ బాడీతో పాటు ఇందులో LED DRL ఇండికేటర్లు, హ్యాండ్ బ్రేక్, ఫుట్ బ్రేక్ కూడా ఇవ్వబడ్డాయి.

