Incinolet Toilet: ఈ టాయిలెట్‌కి నీరు అక్కర్లేదు.. మొత్తం తగలెట్టేస్తుంది!

Incinolet Toilet: మన ఇండియాలో నీటికి కొరత ఉండదు కాబట్టి.. మనం చాలా పనులకు నీటిని ఉపయోగిస్తాం. ఐతే.. నీటి అవసరం లేకుండా.. తగలబెట్టేసే టాయిలెట్లు కూడా ఉంటాయి. మరి అవి ఎలా పనిచేస్తాయి? వాటిని ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్ట్ ఇన్సినోలెట్ అనే సరికొత్త టాయిలెట్ గురించి వివరిస్తోంది. ఈ టాయిలెట్ నీటిని ఉపయోగించకుండా.. మానవ వ్యర్థాలను (మలం) వేడితో కాల్చి బూడిదగా మారుస్తుంది. ఈ టెక్నాలజీ, ముఖ్యంగా నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో, ఆఫ్-గ్రిడ్ జీవనశైలిని గడిపే వారికీ, లేదా సాంప్రదాయ సెప్టిక్ సిస్టమ్స్‌ను నిర్వహించలేని వారికి ఒక విప్లవాత్మక పరిష్కారంగా మారింది. ఈ టాయిలెట్ పనితీరు, ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఎలా పనిచేస్తుంది?
ఇన్సినోలెట్ టాయిలెట్ పనితీరు చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది ఒక ప్రత్యేక లైనర్‌ను ఉపయోగిస్తుంది. ఈ లైనర్‌ను టాయిలెట్ బౌల్‌లో ఉంచి, మానవ వ్యర్థాలను సేకరిస్తుంది. టాయిలెట్‌ని ఉపయోగించిన తర్వాత… నీటిని ఫ్లష్ చేసే అవసరం లేకుండా… ఫుట్ పెడల్‌ను నొక్కాల్సి ఉంటుంది. అలా నొక్కితే, లైనర్, వ్యర్థాలు ఇన్సినరేషన్ ఛాంబర్‌లోకి జారిపోతాయి. తర్వాత ఒక బటన్ నొక్కితే, హీటర్, బ్లోయర్ పనిచేయడం ప్రారంభించి, వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రత దగ్గర కాల్చి, సూక్ష్మమైన బూడిదగా మారుస్తాయి. ఈ ప్రక్రియలో టాయిలెట్ సుమారు 1.5 నుంచి 2 కిలోవాట్-అవర్స్ శక్తిని ఉపయోగిస్తుంది. ఇందుకు ఒక గంట నుంచి రెండు గంటల టైమ్ తీసుకుంటుంది.ఈ టాయిలెట్‌లో నీటి అవసరం లేకపోవడం ఒక ప్రధాన ప్రయోజనం. సాంప్రదాయ టాయిలెట్‌లలో నీటితో ఫ్లష్ చేయడం, వ్యర్థాలను సెప్టిక్ ట్యాంక్ లేదా పైప్‌లైన్ ద్వారా తొలగించడం సాధారణం. కానీ, ఇన్సినోలెట్ విషయంలో వ్యర్థాలు నేరుగా కాలిపోతాయి కాబట్టి, నీటి అవసరం లేదు. అయితే, వ్యక్తిగత పరిశుభ్రత కోసం నీటితో కడుక్కోవడం ఇప్పటికీ అవసరమని వినియోగదారులు తెలిపారు. అంటే.. పని పూర్తయ్యాక.. ఇప్పటిలాగానే నీటితో కడుక్కోవచ్చు. ఆ తర్వాత ఫ్లష్ చెయ్యకూడదు. నీటిని వాడినా.. వ్యర్థాలను కాల్చే ప్రక్రియకు ఎలాంటి ఆటంకమూ కలగదు. ఎందుకంటే లైనర్, వ్యర్థాలను పూర్తిగా ఛాంబర్‌లోకి తీసుకెళ్తుంది.
