ICC 2-Ball Rule: New Rule in Cricket

ICC New Rule: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది. జెంటిల్మన్ గేమ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఇంకో నయా రూల్ తీసుకొస్తోంది మెగా క్రికెట్ బోర్డు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌లో అవసరానికి తగ్గట్లు కొత్త నిబంధనలు తీసుకొస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఆటలో మజాను మరింత పెంచేందుకు, బంతి-బ్యాట్‌కు మధ్య పోరును రసవత్తరంగా మార్చేందుకు ఈ రూల్స్ ఉపయోగపడుతున్నాయి. ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ కూడా ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో రూల్‌కు ప్లానింగ్ చేస్తోంది ఐసీసీ. వన్డే క్రికెట్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు 2 బంతుల విధానాన్ని ప్రవేశపెట్టబోతోందట ఐసీసీ. ఆల్రెడీ రెండు బంతుల్ని వాడుతున్న నేపథ్యంలో కొత్త నిబంధనతో ఏం మారబోతోందో ఇప్పుడు చూద్దాం..

ప్లస్సా.. మైనస్సా

వన్డేల్లో ఆల్రెడీ 2 బంతుల విధానం అమల్లో ఉంది. 2011లో తీసుకొచ్చిన ఈ నిబంధన ప్రకారం.. ఒక్కో బంతిని 25 ఓవర్లు చొప్పున వినియోగిస్తారు. అయితే ఈ రూల్ వల్ల బ్యాటర్లకు ఎక్కువ హెల్ప్ అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బంతి పాతబడకపోవడంతో స్వింగ్‌ను నమ్ముకునే పేసర్లకు నరకం కనిపిస్తోందని, వికెట్లు పడకపోగా..

భారీగా రన్స్ సమర్పించుకోవడంతో టీమ్‌కు నెగెటివ్ అవుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి 2 కొత్త బంతుల్ని వాడుతూనే.. 25 ఓవర్ల తర్వాత అందులో నుంచి కేవలం ఒకే బాల్‌ను కంటిన్యూ చేసే రూల్ తీసుకురానుందట ఐసీసీ. దీని వల్ల రెండింట్లో బాగా పాతబడిన బాల్‌ను ఎంచుకొని మిడిల్ ఓవర్స్‌లో పేసర్లు స్వింగ్ రాబట్టేందుకు, స్పిన్నర్లు గ్రిప్‌తో వికెట్లు పడగొట్టేందుకు అవకాశం ఉంటుందనేది మెగా బోర్డు ఆలోచన అని తెలుస్తోంది.

ఒప్పుకుంటారా..

ప్రస్తుతం వాడుతున్న రెండు బంతుల విధానం వల్ల బంతి పాతబడే అవకాశం లేకుండా పోయింది. దీంతో రివర్స్ స్వింగ్ కళ దాదాపుగా అంతరించిపోయింది.

అందుకే బాల్-బ్యాట్‌కు మధ్య బ్యాలెన్స్ తీసుకొచ్చే ఉద్దేశంతో 25 ఓవర్ల తర్వాత ఒకే బంతిని కొనసాగించాలనే రూల్‌ను తీసుకొచ్చే దిశగా ఐసీసీ సమాలోచనలు చేస్తోందట. దీనికి అన్ని క్రికెట్ బోర్డులు ఓకే చెబితే త్వరలో రూల్ అమల్లోకి వచ్చే చాన్స్ ఉందని సమాచారం.

చాంపియన్స్ ట్రోఫీ పుణ్యమా అని వన్డేలకు మళ్లీ క్రేజ్ పెరగడంతో.. దీన్ని ఇలాగే కొనసాగించడం, 2027 వన్డే వరల్డ్ కప్‌పై మరింత బజ్‌ను నెలకొల్పేందుకు కొత్త రూల్‌ను వాడుకోవాలని చూస్తోందట ఐసీసీ. కాగా, కొత్త రూల్ అమల్లోకి వస్తే మిడిల్ ఓవర్స్‌లో స్వింగ్ బౌలర్లు, ఫింగర్ స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు నరకంగా మారే ప్రమాదం ఉంది.

దీని వల్ల లోస్కోరింగ్ మ్యాచెస్ జరిగే చాన్స్ కూడా ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని నిబంధనను ఐసీసీ మరింత పకడ్బందీగా రూపొందిస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *