నేనేం పత్తిత్తు కాదు.. చాలా తప్పులు చేశా .. ఇన్నాళ్లకు ఓపెనైనా సమంత …

టాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలను చెరిపేసి, కేవలం తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్న హీరోయిన్ సమంత. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలలో నటించి, ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో సమంత తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ‘జెస్సీ’ పాత్రలో ఆమె చూపించిన అభినయం, అమాయకత్వం యువతను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ‘దూకుడు’, ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’ వంటి వరుస విజయాలతో ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ‘మనం’, ‘రంగస్థలం’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ వంటి చిత్రాలు ఆమె నటనకు మరో నిదర్శనంగా నిలిచాయి. తమిళంలోనూ ‘తేరి’, ‘మెర్సల్’ వంటి పెద్ద చిత్రాలలో భాగమై, తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు.
హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సమంత, ఇండస్ట్రీలో ఒక ఆదర్శ జంటగా నిలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు, వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వారిద్దరి మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అటు నాగ చైతన్య శోభితను వివాహం చేసుకోగా, సమంత మాత్రం ఒంటరిగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొంతకాలం పాటు ‘మయసైటీస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడిన సమంత, సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ దశలో ఆమె చూపించిన ధైర్యం, పోరాట పటిమ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకుని, మళ్లీ సినిమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టి, కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నా జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయం అందరికీ తెలుసు. నా విడాకులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు… ప్రతి ఒక్కటి ప్రజల సమక్షంలోనే జరిగాయి. ఆ సమయంలో నేను ఎంతగా సఫర్ అయ్యానో కూడా వారికి తెలుసు అని సమంత భావోద్వేగంగా చెప్పుకొచ్చింది.
వ్యక్తిగత జీవితంలో గందరగోళం నెలకొన్నప్పుడు, తనపై లక్షల సంఖ్యలో ట్రోల్స్ వచ్చాయని సమంత గుర్తు చేసుకుంది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు జడ్జ్మెంట్ ఇచ్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, తన జీవితంలో ఏమి జరుగుతుందో అనే ప్రశ్నకు జవాబు తనకే తెలియకపోయినా, ప్రతిసారీ వాటి గురించి మాట్లాడాల్సి వస్తోందని పేర్కొంది. సమంత తన గురించి తాను విశ్లేషించుకుంటూ, నేనేమీ పర్ఫెక్ట్ అమ్మాయిని కాదు… ఒప్పుకుంటాను. నేను కూడా చాలా తప్పులు చేశాను. వాటి నుంచే గుణపాఠం కూడా నేర్చుకున్నానని నిజాయితీగా అంగీకరించింది. “కానీ ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్ అయ్యాను” అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. సమంత చేసిన ఈ నిజాయితీ, భావోద్వేగపూరిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె ధైర్యంగా తన లోపాలను అంగీకరించి, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నానని చెప్పడంపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు చూసినప్పటికీ, మరింత బలంగా నిలబడిన ఆమె స్ఫూర్తిని చాలామంది అభినందిస్తున్నారు.
