ఎంతమంది ఉద్యోగాలు వదులుకుంటారో?

విశాఖ ఉక్కు కర్మాగారంలో ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమం నడుస్తోంది. వ్యయాలను తగ్గిస్తే ఆదాయాలు పెరిగినా లేకపోయినా స్టీల్ ప్లాంట్ నష్టాలు ఎంతో కొంత తగ్గుతాయన్నది యాజమాన్యం ఆలోచనగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వీఆర్ఎస్ అంటూ తరచూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.

గతంలో రెండు మార్లు ఈ విధంగా వీఆర్ఎస్ కి ఆఫర్లు ఇవ్వడంతో దాదాపుగా వేయి మంది దాకా ఉద్యోగులు తమ జాబ్స్ స్వచ్చందంగా వదులుకుని వెళ్ళిపోయారు.

లేటెస్ట్ గా మరోసారి విశాఖ ఉక్కులో వీఆర్ఎస్ పర్వం సాగుతోంది. గత నెల 24న వీఆర్ఎస్ కి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ గడువుని ఈ నెల 20 దాకా విధించారు. ఈ నెల రోజుల వ్యవధిలో అయిదు వందల మంది దాకా స్టీల్ ప్లాంట్ లోని వివిధ విభాగాల నుంచి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అయితే ఈ వీఆర్ఎస్ గడువుని మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. దానికి కారణం అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదని అంటున్నారు. ఈ వారంలో మరెంతమంది వీఆర్ఎస్ బాటలో నడుస్తారో చూడాలని అంటున్నారు.

అధిక సంఖ్యలో ఉద్యోగులు వీఆర్ఎస్ లోకి వెళ్తే సంస్థ మీద ఆర్థిక భారం తగ్గుతుందని సంస్థ ఆలోచనగా కనిపిస్తోంది అని అంతున్నారు. అయితే వీఆర్ఎస్ పేరుతో పర్మనెంట్ ఉద్యోగులను ఇంటికి పంపించే కార్యక్రమం ద్వారా సంస్థ కార్యకలాపాలను దెబ్బ తీస్తున్నారు అని ఉక్కు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు.

నిపుణులు అయిన ఉద్యోగులు అనేక విభాగాలలో లేరని, ఖాళీలు అయిన స్థానంలో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు. ఇదంతా ప్రైవేటీకరణలో భాగమే అని వారు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈసారి వీఆర్ఎస్ పేరుతో ఎంత మంది ఉద్యోగాలు వదులుకుని బయటకు వెళ్తారు అన్నదే అంతా తర్కించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top