విశాఖ భూముల కేటాయింపుపై హైకోర్టు ఆగ్రహం.. ఏబీఎన్ రాధాకృష్ణకు నోటీసులు

విశాఖలో విలువైన ప్రభుత్వ భూమిని ఏబీఎన్ (ABN) ఆంధ్రజ్యోతి సంస్థకు ఉచితంగా కేటాయించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

విశాఖలో విలువైన ప్రభుత్వ భూమిని ఏబీఎన్ (ABN) ఆంధ్రజ్యోతి సంస్థకు ఉచితంగా కేటాయించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ భూమిని ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఈ వ్యవహారంలో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.

హైకోర్టు ప్రశ్నల వర్షం…

విశాఖకు చెందిన నక్క నమ్మి గ్రేస్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఏ చట్టం కింద ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు ఉచితంగా బదలాయింపు చేశారు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ భూమికి సంబంధించి ఏవైనా సేల్ డీడ్ (Sale Deed) ప్రతివాదుల కంపెనీల పేరుతో రాశారా అని నిలదీసింది. పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తుత విధానాల (Policy) ప్రకారం, విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు ఉచితంగా రాసిచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం రాజకీయ లేదా ఇతర కారణాలతో ప్రజా ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన వాదించారు.

ఈ మేరకు ప్రభుత్వ పక్షాన వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ కేసులో పూర్తి వివరాలు సమర్పించడానికి రెండు వారాల సమయం కావాలని కోరారు. అదేవిధంగా భూ కేటాయింపుపై పూర్తి వివరాలతో కూడిన ప్రమాణ పత్రం (Affidavit) దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యంతో సహా ఇతర ప్రతివాదులందరికీ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. కేసులో తదుపరి విచారణను ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top