Heart Attack: ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు.. ప్రతి 5 కేసుల్లో ఒకరికి.. వీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి

సాధారణ లక్షణాలు మాత్రమే కాకుండా, కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు చెక్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. ఛాతీ నొప్పి, ఎడమ భుజం, చేయి లాగడం, చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం వంటివి కొన్ని సంకేతాలు. అయితే ఈ మధ్య కాలంలో ఎలాంటి లక్షణాలు లేకుండానే ‘సైలెంట్ హార్ట్ ఎటాక్’ వస్తోంది.ప్రతి ఐదు కేసుల్లో ఒకటి ఇలాంటిదే ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి వయసుతో సంబంధం లేకపోవడం మరో డేంజర్. అందుకే సాధారణ లక్షణాలు మాత్రమే కాకుండా, కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు చెక్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు నమోదవుతున్న గుండెపోటు కేసుల్లో 20 శాతం ఎలాంటి లక్షణాలు, హెచ్చరికలు ఉండట్లేదు. ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి కామన్ సింప్టమ్స్ అసలే కనిపించవు. శరీరంలో గుర్తించలేని చిన్నపాటి మార్పులు ఉంటాయి.రక్తాన్ని గుండె సరిగా పంపింగ్ చేయకపోవడం వల్ల మెదడుకు రక్తం చేరడం ఆగిపోతుంది. అదే సమయంలో గుండె పనితీరు క్రమంగా బలహీనపడుతుంది. దీంతో ఒక విధమైన అసౌకర్య భావన కలుగుతుంది. ఇది ఊహించిన దాని కంటే ఎక్కువ తీవ్రతతో ఉంటుంది. అందుకే సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు బాధితులు ఉన్నట్టుండి మూర్ఛ వచ్చి పడిపోవడమో, అకస్మాత్తుగా కుప్పకూలిపోవడమో చూస్తుంటాం. జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా వచ్చే హార్ట్ఎటాక్లు, స్పోర్ట్స్ ఆడుతుండగా ఉన్నట్టుండి పడిపోవడం వంటివి సైలెంట్ హార్ట్ ఎటాక్ ప్రభావంగానే జరుగుతాయి. ఈ సంకేతాలు కూడా..
సైలెంట్ హార్ట్ ఎటాక్‌ను కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. వీపు పైభాగంలో లేదా దవడలో కొద్దిగా అసౌకర్యం, అకారణంగా ఆకస్మికంగా అలసట కలగడం, తల తిరగడం, మైకం కమ్మడం, తెలియని ఆందోళన వంటివి అనుభూతి చెందుతారు. ఇవి ఒత్తిడి (Stress), నిద్రలేమి (Poor Sleep), జీర్ణక్రియ మందగించడం (Poor Digestion) వల్ల కలిగే లక్షణాలని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో గుండె పోటు రావచ్చని సూచించవచ్చు. సడన్‌గా ఎందుకు కూలిపోతారు?
సడన్ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చాలా మంది అకస్మాత్తుగా పడిపోతుంటారు. గుండె ఎలక్ట్రిక్ రిథమ్ దెబ్బతినడం, వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయినప్పుడు అది రక్తాన్ని సరిగా పంప్ చేయదు. దీంతో మెదడుకు సరిపడా రక్తం అందక శరీర అవయవాలపై పట్టు కోల్పోతుంది. ఈ కారణంగా గుండెపోటు వచ్చినప్పుడు మూర్ఛతో పడిపోతారు. గుండెకు ఉండే మూడు ప్రధాన ధమనులలో ఒకటైన ఎడమ ప్రధాన ధమని మూసుకుపోయినప్పుడు గుండె కండరాలలోని ఒక నిర్దిష్ట భాగానికి రక్త ప్రవాహం ఆగిపోతుంది. దీంతో, ఆ భాగం త్వరగా పాడైపోయి క్రమంగా క్రియారహితంగా మారుతుంది. గుండె కండరాలు ఇబ్బంది పడుతూ నొప్పిని కలగజేస్తాయి.

