కొబ్బరిబోండం నుంచి డైరెక్ట్ నీళ్లు తాగుతున్నారా..? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే..

రాష్ట్ర రవార్థ :
కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వైద్యులు సైతం దీనిని తరుచుగా తాగమని చెబుతారు. అయితే ఇటీవలి అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. కొబ్బరి కాయ నుంచి నేరుగా నీళ్లు తాగడం ప్రమాదకరమని తేల్చింది. ఇప్పటికే ఓ వ్యక్తి కూడా మరణించడం గమనార్హం.
కొబ్బరికాయను కొట్టేటప్పుడు అది పూర్తిగా శుభ్రంగా ఉండదు. వెచ్చగా, తేమగా ఉండే వాతావరణంలో ఉంచినప్పుడు, కొబ్బరి పెంకులోని చిన్న పగుళ్ల ద్వారా లేదా వాటిని పట్టుకున్నప్పుడు సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశించవచ్చు. దీనివల్ల లోపల ఉండే నీళ్లు కలుషితం అవుతాయి. ఈ కలుషితం బయట నుండి చూస్తే కనిపించదు.
డెన్మార్క్‌లో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన దీనికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అక్కడ 69 ఏళ్ల వృద్ధుడు కొబ్బరి నీళ్ళు తాగి చనిపోయాడు. ఆ కొబ్బరి లోపల విషాన్ని ఉత్పత్తి చేసే ఫంగస్ ఉండటమే దీనికి కారణం. నీళ్ళు తాగిన మూడు గంటల్లోనే ఆయనకు వాంతులు, చెమటలు పట్టడం మొదలయ్యాయి. 26 గంటలకే అతని ముఖ్యమైన అవయవాలు దెబ్బతిని మరణించాడు. ఈ విషానికి కారణం 3-నైట్రోప్రొపియోనిక్ ఆమ్లం అనే విషపదార్థం అని వైద్యులు గుర్తించారు.
జీర్ణ సమస్యలు: పాత లేదా కలుషితమైన కొబ్బరి నీళ్ళలో ఉండే బ్యాక్టీరియా వల్ల వికారం, వాంతులు, కడుపు నొప్పి, డయేరియా వంటి జీర్ణ సమస్యలు రావచ్చు. ఇవి సాధారణ ఫుడ్ పాయిజనింగ్‌లా అనిపిస్తాయి. అందుకే చాలామంది అసలు కారణం కొబ్బరి నీళ్లేనని గుర్తించలేరు.
నాడీ వ్యవస్థపై ప్రభావం: ఫంగస్ వల్ల ఉత్పత్తి అయ్యే 3-NPA వంటి విషాలు నేరుగా నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీనివల్ల గందరగోళం, తల తిరగడం, కండరాల కదలికలు సరిగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం అవసరం.
ప్రాణాంతక ప్రమాదం: కలుషితమైన కొబ్బరి నీటి వల్ల ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. డెన్మార్క్‌లో జరిగినట్లుగా.. కొన్ని రకాల ఫంగస్‌లు చాలా వేగంగా అవయవాలను దెబ్బతీసి మరణానికి కారణం కావచ్చు. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యకరమైనవే అయినా వాటిని నేరుగా కొబ్బరికాయ నుండి తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

