ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ విద్యుత్ ఛార్జీలన్నీ వెనక్కు ఇస్తారు.. ‘ట్రూడౌన్’ వివరాలివే

AP Electricity Bill True Down Charges: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త! గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ, కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు డిస్కంలు రూ.449.60 కోట్లు తిరిగి చెల్లించనున్నాయి. ‘ట్రూడౌన్’ పేరుతో ఈ ప్రక్రియ జరగనుంది. అసలు ఈ ట్రూడౌన్ అంటే ఏమిటి? మీ డబ్బు మీకు ఎలా అందుతుంది? విద్యుత్ రంగంలో జరుగుతున్న ఈ మార్పుల గురించి తెలుసుకోవాలంటే, మరిన్ని వివరాల కోసం చదవండి!
హైలైట్:
- ఏపీ ప్రజలకు ఇక పండగే, పండగ
- త్వరలో ట్రూ డౌన్ ఛార్జీలు అమలు
- రూ.449.60 కోట్లు తిరిగి చెల్లిస్తారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపికబురు చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బిల్లులు పెంచితే కూటమి ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఎప్పుడూ ప్రజలు (వినియోగదారులకు) ‘ట్రూ అప్ ఛార్జీలు’ అనే పదం వింటుంటాం. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు సరికొత్తగా ‘ట్రూడౌన్’ అనే పదం వినబోతున్నారు. అవును మొదటి సారిగా డిస్కంలు రూ.449.60 కోట్లు వినియోగదారులకు తిరిగి చెల్లించనున్నాయి. డిస్కంలు గత ఆర్థిక సంవత్సరం ఎఫ్‌పీపీసీఏ ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీకి సమర్పించాయి. దీనిపై 90 రోజుల్లో కమిషన్ ఉత్తర్వులు జారీ చేస్తుంది.. ఈ ట్రూ డౌన్ ఛార్జీల మొత్తాన్ని వినియోగదారులకు ఎలా సర్దుబాటు చేయాలో కమిషన్ సూచనలు చేస్తుంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ కొనుగోళ్లలో తేడాలు వచ్చాయి. డిస్కంలు ఈ వ్యత్యాసాన్ని ఎఫ్‌పీపీసీఏ కింద లెక్కిస్తాయి. దీని ప్రకారం కొన్ని డిస్కంలు ట్రూఅప్ కింద రూ.842.68 కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించాయి. అయితే ఈపీడీసీఎల్ మాత్రం రూ.1,292.28 కోట్లు ట్రూడౌన్ కింద తిరిగి చెల్లించాలని కోరింది. విద్యుత్ కొనుగోలుకు అయిన ఖర్చు, వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం వేర్వేరుగా ఉంటాయి. ఈ తేడాను డిస్కంలు ఎఫ్‌పీపీసీఏ ద్వారా సరిచేస్తాయి.. ఒకవేళ కొనుగోలు ఖర్చు ఎక్కువైతే, ట్రూఅప్ ద్వారా వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు.
అయితే ఒకవేళ తక్కువగా ఉంటే, అధికంగా వసూలు చేసిన డబ్బును విద్యుత్ వినియోగదారులకు తిరిగి ఇస్తారు. డిస్కంలు వినియోగదారుల నుండి ఎఫ్‌పీపీసీఏ పేరుతో యూనిట్‌కు 40 పైసలు వసూలు చేశాయి. ఇలా మూడు డిస్కంలు కలిసి రూ.2,782.19 కోట్లు వసూలు చేశాయి. ప్రతి నెలా విద్యుత్ కొనుగోలుకు అయిన అదనపు ఖర్చుపై వడ్డీని క్యారీయింగ్ కాస్ట్ అంటారు. డిస్కంలు ఈ మొత్తాన్ని వినియోగదారుల నుండి వసూలు చేశాయి.

