శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుపతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్

దక్షిణ మధ్య రైల్వే కరీంనగర్-తిరుపతి మధ్య 8 స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. జూలై 6-27 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి, జూలై 7-28 వరకు ప్రతి సోమవారం కరీంనగర్ నుంచి రైళ్లు నడుస్తాయి.
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు కూడా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కరీంనగర్ నుంచి తిరుపతికి మధ్య 8 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జూలై 6 నుంచి 27 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి కరీంనగర్‌కు నాలుగు స్పెషల్ రైళ్లు, జూలై 7 నుంచి 28వ తేదీ వరకు ప్రతి సోమవారం కరీంనగర్ నుంచి తిరుపతికి నాలుగు స్పెషల్ రైళ్లు నడపనున్నట్లుగా తెలిపింది. కరీంనగర్, ఆ పరిసర ప్రాంతాల నుంచి తిరుపతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, దీనిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు నంబర్ 02762. జూలై 7 నుంచి 28వ తేదీ వరకు ప్రతి సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలులో కరీంనగర్ నుంచి తిరుపతికి ఏసీ 3 టైర్ టికెట్ ధర రూ.1,355గా ఉంది. అలాగే పెద్దపల్లి నుంచి తిరుపతికి ఏసీ 3 టైర్ టికెట్ ధర రూపాయలు 1,300గా ఉంది. తిరుపతి నుంచి కరీంనగర్‌కు రైలు నంబర్ 02761. జూలై 6 నుంచి 27 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కరీంనగర్‌కు చేరుకుంటుంది. ఈ రైలులో తిరుపతి నుంచి కరీంనగర్‌కు ఏసీ 3 టైర్ టికెట్ ధర రూపాయలు 1,355గా ఉంది. అలాగే తిరుపతి నుంచి పెద్దపల్లికి ఏసీ 3 టైర్ టికెట్ ధర రూ. 1,300గా ఉంది. ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
News by : V.L

