Gold Price Drop: రూ.3,660 తగ్గిన బంగారం ధర.. 2 వారాలుగా ధరలు ఢమాల్.. కొనాలా? వద్దా?

old Price Drop: బంగారం ధరలు పడిపోతూ ఉండటం.. నగలు కొనుక్కునేవారికి కలిసొచ్చే అంశం. మరి ఈ ధరలు ఇంకా తగ్గుతాయా? ఇప్పుడు మనం నగలు కొనుక్కోవచ్చా? అసలు బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి? తెలుసుకుందాం.
భారతదేశంలో బంగారం ధరలు జూన్ 15 నుంచి తగ్గుతున్నాయి. రోజురోజుకూ పతనం అవుతున్నాయి. మనం 2 వారాలుగా ధర ఎంత తగ్గిందో గమనిద్దాం. జూన్ 15న, 24 క్యారెట్ల పెట్టుబడి బంగారం ధర 10 గ్రాములకు రూ.1,01,680గా ఉండగా, 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.93,200గా నమోదైంది. అయితే, ఇవాళ (జూన్ 29).. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.98,020గా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.89,850గా ఉంది. ఇది చాలా ఎక్కువ తగ్గుదలే. ఈ 2 వారాల్లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.3,660 (3.6%) తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,350 (3.6%) తగ్గింది. ఈ ధరల క్షీణతకు అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు దోహదపడ్డాయి.
బంగారం ధరల తగ్గుదలకు కారణాలు:
బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలలో ఒకటి అమెరికా డాలర్ బలపడటం. బంగారం, అమెరికా డాలర్ మధ్య రివర్స్ సంబంధం ఉంటుంది. డాలర్ బలపడినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. అదే.. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరుగుతాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసింది. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి. అందువల్ల డాలర్‌పై నమ్మకం పెరిగింది. డాలర్ బలపడింది. అంతేకాక ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ తగ్గింది. ప్రపంచ పరిస్థితుల్లో ఉద్రిక్తతలు కొంత తగ్గాయి. అందువల్ల పెట్టుబడిదారులు.. బంగారాన్ని అమ్మేసుకొని.. ఆ డబ్బుతో డాలర్స్, బాండ్లు కొంటున్నారు.

